లక్షల ఫీజులు.. బోధన కరువు | - | Sakshi
Sakshi News home page

లక్షల ఫీజులు.. బోధన కరువు

Sep 28 2026 12:59 AM | Updated on Sep 28 2026 12:59 AM

● ఏయూలో ఫ్యాకల్టీ కొరతపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన ● పది సెక్షన్లకు ఒక్కరే బోధన

విశాఖవిద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎన్నడూ లేని విధంగా ఫ్యాకల్టీ కొరత నెలకొందని, లక్షల రూపాయల ఫీజులు చెల్లిస్తున్నా విద్యార్థులకు సరైన బోధన అందడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని, గత మూడు నెలలుగా పలు సబ్జెక్టులకు సక్రమంగా తరగతులు జరగడం లేదని ఆరోపించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా తాత్కాలిక అధ్యాపకులను తొలగించడం, ఇతర కారణాలతో విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతోందని తెలిపారు.

మెటీరియల్‌తో చదువులా?

కాలేజీ టైమ్‌టేబుల్‌లో రీసెర్చ్‌ స్కాలర్ల పేర్లను చూపిస్తున్నారని, కొన్ని చోట్ల ఒకే రెగ్యులర్‌ అధ్యాపకుడి పేరును పలు సెక్షన్లకు కేటాయించారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. వాస్తవంగా ఆ అధ్యాపకుడు ఒక సెక్షన్‌కు మాత్రమే బోధిస్తూ, మిగిలిన విద్యార్థులకు మెటీరియల్‌ ఆధారంగా చదువుకోవాలని సూచిస్తున్నారని ఆరోపించారు.

ఎం.టెక్‌ విద్యార్థులతో బోధన

సెమిస్టర్‌ ప్రారంభమై మూడు నెలలు గడిచినా పరిస్థితిలో మార్పు లేదని తల్లిదండ్రులు తెలిపారు. బీటెక్‌ విద్యార్థులకు థియరీ తరగతుల కోసం ఎం.టెక్‌ విద్యార్థులు, రీసెర్చ్‌ స్కాలర్లను వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఏడాదికి రూ.2 లక్షలకు పైగా ఫీజులు వసూలు చేస్తూ రెగ్యులర్‌ ఫ్యాకల్టీ లేకుండా బోధన కొనసాగించడం సరికాదని అన్నారు.

సిలబస్‌, పరీక్షలపై ప్రభావం

రెగ్యులర్‌ అధ్యాపకుల సంఖ్య తగ్గడంతో సిలబస్‌ పూర్తికావడం లేదని, పరీక్షలకు సిద్ధమయ్యే విషయంలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆందోళనకు సిద్ధం

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని తల్లిదండ్రుల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. అవసరమైతే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో త్వరలో సమావేశం నిర్వహించి, అనంతరం ఈ అంశాన్ని విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఫ్యాకల్టీ నియామకాలు, అధ్యాపకుల అందుబాటు, టైమ్‌టేబుల్‌లో ఎం.టెక్‌ విద్యార్థులు, రీసెర్చ్‌ స్కాలర్ల పాత్రపై ఏయూ పరిపాలనా యంత్రాంగం స్పష్టత ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement