కళ్లలో సంతృప్తి.. గుండెల్లో వీడ్కోలు బాధ.. ఈ రెండు భావాల మధ్య మంగళవారం ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లాల విభజనతో మూడు ముక్కలైన ఉమ్మడి విశాఖను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఈ చివరి భేటీ, కేవలం ఒక పరిపాలనా తంతుగా కాక భావోద్వేగాల సంగమంగా మారింది. పింఛన్ల మంజూరు మొదలు వైద్య సేవల విస్తరణ దాకా ప్రజా సమస్యలపై వాడీవేడి చర్చలు ఒకవైపు సాగుతుండగా, మరోవైపు ఐదేళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర స్వరం భారమైంది . ‘జిల్లాలు విడిపోయినా ప్రజాసేవలో మాత్రం మనమంతా కలిసే ఉంటాం’ అంటూ ఆమె పలికిన మాటలు సభాస్థలిని కంటతడి పెట్టించాయి. –సాక్షి, విశాఖపట్నం
సమావేశంలో విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ అంశాలపై సభ్యులు చర్చించారు.గ్రామ స్థాయి సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై సభ్యులు ప్రస్తావించారు. మండల కేంద్రాల్లో అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తేవాలని, ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే రోగులను కేజీహెచ్‌కు రిఫర్ చేయాలని కోరారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై కూడా చర్చించారు.కొత్త పింఛన్ల మంజూరు, సదరం సర్టిఫికెట్ల జారీలో అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒంటరి మహిళల పింఛన్ల నిబంధనలు సడలించాలని కోరారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీల గౌరవ వేతనాలు పెండింగ్‌లో ఉన్న అంశాన్ని సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు.
పింఛన్లపై వాడీవేడిగా చర్చ
పింఛన్ల అంశంపై సమావేశంలో వాడీవేడి చర్చ జరిగింది. సభ్యుల డిమాండ్‌తో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సుభద్ర అధికారులను ఉమ్మడి జిల్లాలో వచ్చిన పింఛన్ దరఖాస్తుల వివరాలు వెల్లడించాలని ఆదేశించారు. జీవీఎంసీ, డీఆర్‌డీఏ అధికారులు వివరాలు ఇవ్వగా, వాటిపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.విడో, దివ్యాంగ, వృద్ధాప్య పింఛన్లు, సదరం సర్టిఫికెట్ల జారీలో సమన్యాయం లేదని సభ్యులు ప్రస్తావించారు. శిశుసంక్షేమశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఈర్లె అనురాధ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా పింఛన్లు మంజూరు కాలేదన్నారు. దరఖాస్తులకు ఇచ్చిన గడువు తక్కువగా ఉందని, అర్హులందరికీ పింఛన్లు అందుతాయా అనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. భర్తను కోల్పోయిన మహిళలకు విడో పింఛన్ దరఖాస్తులోనూ ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని సభ్యులు కోరారు.
జెడ్పీటీసీల గౌరవ వేతనాలకు తీర్మానం
2021–2026 సెప్టెంబర్ 24 వరకు పనిచేసిన జెడ్పీటీసీ సభ్యుల పెండింగ్ గౌరవ వేతనాలు చెల్లించాలని సభ్యులు కోరారు. జెడ్పీ జనరల్ ఫండ్ నుంచైనా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా, జెడ్పీ చైర్‌పర్సన్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న 18 నెలల గౌరవ వేతనం రూ.66 లక్షలు విడుదల చేయాలని, 15వ ప్లానింగ్ కమిషన్ చివరి క్వార్టర్ నిధులు రూ.2.82 కోట్లు మంజూరు చేయాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
జిల్లాల మధ్య ఆస్తుల పంపిణీపై సూచన
జిల్లా పరిషత్ విభజన అనంతరం విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు సమన్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర, సీఈవోలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో పాటు సభ్యులు కోరారు. ఉమ్మడి జిల్లా ఆస్తులు, గెస్ట్‌హౌస్‌లను మూడు జిల్లాలకు చెందినవిగా పరిగణించాలని, భవిష్యత్తులో జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా కల్పించాలని కోరారు. ఏజెన్సీ, అనకాపల్లి ప్రాంతాల ప్రజలు, మాజీ ప్రజాప్రతినిధులు జడ్పీ గెస్ట్‌హౌస్‌లను వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఆత్మీయ సత్కారం
జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్రను రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తదితరులు సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు, పలువురు ఎంపీపీలను కూడా అతిథుల చేతుల మీదుగా ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా సభ్యులు భావోద్వేగ ప్రసంగాలు చేస్తూ తమ అనుభవాలు, జ్ఞాపకాలను పంచుకున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారానికి కృషి చేశారని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్రను అభినందించారు. అల్లూరి ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్, ఉమ్మడి జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్ వ్యవస్థే రాజకీయ పునాది
పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రజాప్రతినిధుల రాజకీయ ప్రస్థానానికి పునాది వంటిదని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలంటే పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌లో పనిచేసిన అనుభవమే తన రాజకీయ ఎదుగుదలకు పునాదిగా మారిందన్నారు. విశాఖ జిల్లా పరిషత్ నాలుగు మండలాలకు పరిమితం కావడం బాధాకరమని, విస్తృత సేవల కోసం మరిన్ని మండలాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పదవీకాలాన్ని ముగింపుగా కాకుండా భవిష్యత్ అవకాశాలకు పునాదిగా చూడాలని సభ్యులకు సూచించారు.
ప్రజల విశ్వాసమే అసలైన గుర్తింపు
ప్రజల విశ్వాసాన్ని పొందడమే ప్రజాప్రతినిధుల అసలైన విజయమని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. జిల్లా పరిషత్ ద్వారా గ్రామీణాభివృద్ధికి చైర్‌పర్సన్, సభ్యులు అందించిన సేవలను అభినందించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు, తాగునీరు వంటి సమస్యలను సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజల కోసం చేసిన సేవలు, సంపాదించుకున్న గౌరవమే చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
జగనన్నకు రుణపడి ఉంటా
మారుమూల ప్రాంతంలో జన్మించిన తనకు ఐదేళ్లపాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. రాజకీయ అనుభవం లేని తనకు జిల్లాలో అత్యున్నతమైన జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ పదవి కల్పించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. చైర్‌పర్సన్‌గా ఐదేళ్లపాటు ప్రజలకు సేవ చేయడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిషత్ చివరి సమావేశం కావడం కొంత బాధగా ఉన్నప్పటికీ, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల విభజన సహజ ప్రక్రియ అని పేర్కొన్నారు. జిల్లాలు విడిపోయినా ప్రజాసేవలో మాత్రం అందరం కలిసే ఉంటామన్నారు. తన పదవీకాలంలో సహకరించిన జెడ్పీటీసీ సభ్యులు, వైస్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, మీడియా మిత్రులకు జల్లిపల్లి సుభద్ర కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సేవలో అంకితభావంతో పనిచేద్దాం జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర భావోద్వేగాల నడుమ ఆఖరి సర్వసభ్య సమావేశం ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధిపై చర్చ


