ఆరిలోవ: సింహాద్రి అప్పన్న కొలువైన కొండను గుల్ల చేస్తూ, ప్రకృతిని శాసించాలనుకున్న దుర్మార్గానికి ప్రకృతి నుంచి తొలి దెబ్బ తగిలింది. ముడసర్లోవ వద్ద సింహాచలం దేవస్థానం కొండ దిగువన జీవీఎంసీ నిర్మించిన భారీ రక్షణ గోడ మంగళవారం భారీ వర్షానికి పేకమేడలా కూలిపోయింది. కొండను ధ్వంసం చేస్తూ చేపట్టిన డేటా సెంటర్ నిర్మాణాల తంతుపై స్థానికంగా ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘తన కొండను ఛిన్నాభిన్నం చేస్తున్న వారిపై సాక్షాత్తు సింహాద్రి వరాహలక్ష్మీనృసింహుడి ఆగ్రహమే ఈ కూల్చివేతకు కారణం’అంటూ స్థానికులు భయంతోనూ, ఆగ్రహంతోనూ మండిపడుతున్నారు.
అసలేం జరిగింది? : ముడసర్లోవ రిజర్వాయర్ ఎదురుగా దేవుడి కొండపై ఎలాంటి ముందూచూపు లేకుండా డేటా సెంటర్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. నిర్మాణాల పేరుతో కొండపై పచ్చదనాన్ని పూర్తిగా తొలగించడమే కాకుండా, రిజర్వాయర్‌లోకి వర్షపు నీరు చేరే సహజ సిద్ధమైన దారులను ఇష్టానుసారంగా మూసివేశారు. ఈ నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా మంగళవారం కురిసిన వర్షానికి కొండపై నుంచి ఉప్పొంగి వచ్చిన వరద నీరు దిగువకు వెళ్లే దారిలేక రిజర్వాయర్ మార్గం వద్ద నిలిచిపోయింది. దీంతో సుమారు 200 మీటర్ల మేర రక్షణ గోడ కొండ వైపునకు కుప్పకూలింది. డేటా సెంటర్ పనులను కప్పి ఉంచిన రేకుల ముసుగు కూడా నేలమట్టమైంది.
అధికారుల మౌనం..
భయాందోళనలో ప్రజలు
ప్రకృతిని నాశనం చేస్తూ చేపట్టిన ఈ పనుల వల్లే ఈ ముప్పు ముంచుకొచ్చిందని నిపుణులు, స్థానికులు స్పష్టం చేస్తున్నారు. నీటి ప్రవాహ మార్గాలను అడ్డగించి, కొండను ఇష్టానుసారంగా తవ్వుతుంటే అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తీవ్రమవుతున్నాయి. దేవుడి భూములు, కొండ కనుమరుగవుతుంటే అప్పన్న కోపానికి బలికాక తప్పదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


