డాబాగార్డెన్స్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాస్తున్న ‘తొలిపలుకు’వ్యాసాలు పత్రికా విలువలకు భంగం కలిగించేలా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్‌వెస్లీ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పత్రికలు సమాజానికి దర్పణంలా ఉండాలని, కుల, రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరికి అనుకూలంగా, మరొకరిపై విమర్శలు చేసేలా వ్యవహరించకూడదని హితవు పలికారు. రాధాకృష్ణ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మత విశ్వాసాలను, ప్రజల మధ్య విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును జీవితాంతం అధికారంలో ఉంచాలనే పేరాశతో జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతికూల ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తన కలంలో కులాన్ని రంగరించి, రాష్ట్ర ప్రజల మెదళ్లలో విషం చిందిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరిగాయని, శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రభుత్వ పాలన గాడి తప్పిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలదేనని, ప్రజలను ప్రభావితం చేసేలా వార్తలు, వ్యాసాలు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.


