ద్వారకానగర్: పోలీసు సిబ్బంది విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం, బెదిరింపులకు పాల్పడిన ఘటనపై న్యాయవాది గీతాప్రసన్నపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆమైపె సైబర్ క్రైమ్ కేసు నమోదు కాగా, తాజాగా ద్వారక పోలీసు స్టేషన్‌లో మంగళవారం రెండో కేసు నమోదైంది. సైబర్ క్రైమ్ కేసులో విచారిస్తున్న పోలీసులకు న్యాయవాది గీతాప్రసన్న ప్రమేయం ఉండటంతో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. సైబర్ క్రైమ్ కేసులో అరెస్టు చేసే సమయంలో ఆమె మహిళా పోలీస్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడంతో ఈ కేసు నమోదయింది. ఈ నెల18న న్యాయవాది గీతాప్రసన్న ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ఘటన జరిగింది. ఆమెను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులను బెదిరించడంతో పాటు, చెవిపోగుతో తనకు తానే గాయపర్చుకునేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసు సిబ్బంది విధులును అడ్డుకోవడం, వారిపై బలప్రయోగం చేయడంతో పిట్టా జయలక్ష్మి ఇచ్చిన నివేదిక ఆధారంగా ద్వారక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


