నీటి సంక్షోభంపై
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మహానగరంలో తాగునీటి సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. గత మూడు నెలలుగా నగరవాసులు చుక్క నీటి కోసం అల్లాడుతున్నా కూటమి ప్రభుత్వం గాఢనిద్ర వీడడం లేదు. అధికార యంత్రాంగం ఉదాసీనత, ప్రభుత్వ ముందస్తు ప్రణాళికారాహిత్యం వల్ల నీటి కొరత రికార్డు స్థాయికి చేరింది. మూడు రోజులకొకసారి, అదీ అర్ధరాత్రి వేళల్లో కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తుండటంతో ప్రజలు జాగారం చేయాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఉదయం లేచినప్పటి నుంచి పనులు, పిల్లల చదువులు, ఉపాధిని సైతం పక్కనబెట్టి ఖాళీ బిందెలు, డ్రమ్ములతో ప్రజలు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. మహిళలు నిరసనలకు దిగుతున్నా ప్రభుత్వంలో ఏమాత్రం స్పందన కరువైంది. దీంతో నగరవాసుల తరఫున కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు వైఎస్సార్‌సీపీ సమరభేరి మోగించింది. ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో విఫలమైన ప్రభుత్వం, జీవీఎంసీ అధికారుల తీరును నిలదీస్తూ మంగళవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ కార్యాలయ ముట్టడి జరగనుంది. ఈ నిరసన కార్యక్రమంలో నగరవాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు.
దాహాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు దందా!
ఓ పక్క ప్రజల దాహార్తితో విలవిలలాడుతుంటే, మరోపక్క నీటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులు ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ప్రైవేట్ దళారులకు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజువారీ అవసరాల కోసం ఉదయం 6 గంటలకే వచ్చి టోకెన్లు తీసుకున్న సామాన్యులను గాలికి వదిలేసి, ప్రైవేటు వాటర్ ట్యాంకర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ. 300ల నామమాత్రపు రుసుముతో జీవీఎంసీ నుంచి 6 వేల లీటర్ల నీటిని పొందుతున్న ప్రైవేటు అసోసియేషన్లు, కేవలం రెండు మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజల నుంచి ఏకంగా రూ. 3,000 వసూలు చేస్తూ దోచుకుంటున్నాయి.
ముందస్తు సమీక్ష ఏదీ?
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఇటీవల భీమిలి, విశాఖ ఉత్తర నియోజకవర్గాల్లో పర్యటించి స్థానికుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నగరానికి ప్రధాన తాగునీటి వనరులైన మేఘాద్రిగెడ్డ, రైవాడ, గంభీరం తదితర రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పూడికతీత, వర్షపు నీటి సంరక్షణపై ప్రభుత్వం ముందస్తు సమీక్షలు నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. జీవీఎంసీ పరిధిలోని ఆరిలోవ, ఎండాడ, మధురవాడ, రుషికొండతో పాటు నగర నడిబొడ్డున ఉన్న అక్కయ్యపాలెం, దొండపర్తి, ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, జగదాంబ, డాబాగార్డెన్స్, కంచరపాలెం, మాధవనగర్, ఎన్‌ఏడీ, గోపాలపట్నం, గాజువాక తదితర ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం నుంచి స్పందన లేకుండాపోయిందని విమర్శించారు.
ప్రభుత్వాన్ని నిలదీస్తాం: కేకే రాజు
తాగునీటి సమస్యపై ప్రభుత్వం, జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంగళవారం జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామని కేకే రాజు తెలిపారు. ప్రజల దాహార్తిని తీర్చడంలో ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలో నెలకొన్న నీటి సంక్షోభాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా నిరంతరం పోరాడతామన్నారు. అధికారుల నిద్రమత్తు వదిలించేందుకు నేడు చేపట్టే ముట్టడి కార్యక్రమంలో నగరవాసులు, పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ ముట్టడి
మూడు నెలలుగా అల్లాడుతున్న నగరవాసులు
మూడు రోజులకొకసారి అర్ధరాత్రి నీటి సరఫరా
ఖాళీ బిందెలతో రోడ్లపై నిరీక్షిస్తున్న మహిళలు
సామాన్యుల దాహార్తిపై ప్రైవేటు దందా..
రూ. 300 ట్యాంకర్ రూ. 3 వేలకు విక్రయం!


