మహారాణిపేట: అర్హత ఉన్నప్పటికీ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోలేకపోయామని, మరో అవకాశం కల్పించాలని కోరుతూ వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు సోమవారం కలెక్టరేట్ బాట పట్టారు. పీజీఆర్‌ఎస్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. కొత్త పింఛన్ల కోసం ప్రభుత్వం ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభించడంతో అర్హుల్లో ఆశలు చిగురించాయని, అయితే కొద్దిరోజులకే పోర్టల్ మూసివేయడంతో దరఖాస్తు చేసుకోలేకపోయారని తెలిపారు. పింఛన్ కోసం అవసరమైన వివిధ ధ్రువపత్రాల సేకరణలో జాప్యం జరగడంతో గడువులోగా దరఖాస్తు చేయలేకపోయామని అర్జీదారులు వాపోయారు. ప్రస్తుతం అవసరమైన ధ్రువపత్రాలు చేతికి వచ్చినప్పటికీ దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. తమకు పింఛన్ పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, కేవలం ధ్రువపత్రాల జారీలో ఆలస్యం కారణంగానే అవకాశం కోల్పోయామని తెలిపారు. ఆన్‌లైన్ పోర్టల్‌ను మరోసారి తెరిచి కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. అర్జీదారుల విజ్ఞప్తులను పరిశీలించి అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఒంటరి మహిళ అంటే చులకనగా చూస్తారా?
ఒంటరి మహిళలు సమస్యలపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం సమర్పించాం. ఒంటరి మహిళలకు వయస్సుతో సంబంధం లేకుండా పింఛన్ మంజూరు చేయాలని, అర్హులను గుర్తించి పింఛన్ అందించి ఆదుకోవాలని కోరాం. వేదికపై ఉన్న ఓ అధికారికి వినతిపత్రం అందించాం. అయితే ఆ అధికారి హేళనగా మాట్లాడారు. పీజీఆర్‌ఎస్‌లో అందరు అధికారుల సమక్షంలో ఒంటరి మహిళల సమస్యలపై మాట్లాడుతున్న సమయంలో.. ‘ఏమైనా సమస్యలు ఉంటే అసెంబ్లీకి వెళ్లి చెప్పుకోండి’ అంటూ హేళనగా మాట్లాడారు. అంతేకాకుండా ‘మీకు మైక్ ఇస్తాను.. స్పీచ్ ఇవ్వండి. కింద స్టేజ్ కడతాను.. అక్కడ స్పీచ్ ఇవ్వండి’ అంటూ చులకనగా మాట్లాడడం బాధ కలిగించింది.
– లక్ష్మి, సాలో ఆర్గనైజేషన్, పీ.ఎం.పాలెం
చేయూతనందించాలి
పుట్టుకతో దివ్యాంగురాలిని. కుటుంబం అండ లేక ఒంటరిగా జీవిస్తున్నాను. నాకు వృద్ధాప్య పింఛన్ రావడం లేదు. గతంలో పీజీఆర్‌ఎస్‌లో పింఛన్ కోసం దరఖాస్తు చేశాను. కానీ రాలేదు. దయుంచి పింఛన్ ఇప్పించాలి.
– పెట్లి లక్ష్మి, తుంగ్లాం, గాజువాక


