అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి ఈకేవైసీ చెయ్యకపోతే 14.2 కిలోల సిలిండర్లు రానట్లే కేవలం 5, 10 కిలోల సిలిండర్లు కొనుగోలు చేసుకోవాల్సిందే విశాఖ జిల్లాలో 8.90 లక్షల కనెక్షన్లలో 89 శాతం ఈకేవైసీ పూర్తి
సాక్షి, విశాఖపట్నం: దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులకు అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ(ఈ–కేవైసీ) చేసుకోని వారికి 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్ల పంపిణీని నిలిపివేయనున్నారు. వీరికి ఇకపై కేవలం 5 కిలోలు లేదా 10 కిలోల సిలిండర్లను మాత్రమే చమురు సంస్థలు సరఫరా చేస్తాయి. జూన్ 30 వరకు ఉన్న గడువును సెప్టెంబర్ 14 వరకు పలుమార్లు పెంచిన తర్వాత ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కూడా అందింది.
జేబుకు చిల్లు గ్యారంటీ!
ఈ కేవైసీ పూర్తి చెయ్యకపోతే.. సామాన్యులకు ఇది పెద్ద ఆర్థిక భారంగా పరిగణించనుంది. ఈ–కేవైసీ చేసుకోని వారికి సబ్సిడీ నిలిచిపోతుంది. అంతేకాకుండా, వారు తీసుకునే 5 కిలోలు, 10 కిలోల సిలిండర్లను వాణిజ్య గ్యాస్ తరహాలో బహిరంగ మార్కెట్ ధరలకు కొనాల్సి వస్తుంది. ఉదాహరణకు, విశాఖలో.. 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ.950 ఉంటే, 5 కిలోల సిలిండర్ రూ.829.50, 10 కిలోల సిలిండర్ రూ.1,765 గా ఉంది.
‘గ్యాస్’పక్కదారి పట్టకుండా..
గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా అడ్డుకోవడానికే ఈ తరహా కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నామని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ చెబుతోంది. గృహావసరాలకు ఇచ్చే సబ్సిడీ సిలిండర్లను కొందరు వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్నారు. బయోమెట్రిక్ అనుసంధానం వల్ల నకిలీ, అనర్హమైన కనెక్షన్లు తొలగిపోతాయి. దీనివల్ల సబ్సిడీ డబ్బు నిజమైన అర్హులకు మాత్రమే చేరుతుందని కేంద్రం చెబుతోంది.
త్వరగా ఈ–కేవైసీ చేసుకోండి
ఈ–కేవైసీ పూర్తి చేయని విశాఖ వాసులు వెంటనే గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి బయోమెట్రిక్ వేస్తే కనెక్షన్ తిరిగి యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత యథావిధిగా సబ్సిడీతో 14.2 కిలోల సిలిండర్ లభిస్తుంది. ఒకవేళ ఈ–కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లలేని వారు సంస్థల వెబ్ పోర్టల్, మొబైల్ యాప్, వాట్సప్ చాట్‌బాట్ లేదా ఐవీఆర్‌ఎస్ ద్వారా తమ ఆప్షన్‌ను నమోదు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలెర్ట్.. మీరు మీ గ్యాస్ కనెక్షన్‌ని ఈ–కేవైసీ చెయ్యలేదా?
అయితే.. మీ కనెక్షన్ బ్లాక్ అయిపోయినట్లే. తర్వాత.. సబ్సీడీ కట్. ఇక మీకు పెద్ద
సిలిండర్లు రావు.. కేవలం మార్కెట్‌లో చిన్న సిలిండర్లను భారీ ధరలకు కొనుగోలు చేసుకోవాల్సిందే. ఎందుకంటే.. ఈ కేవైసీ నమోదుపై కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదే చివరి
అవకాశం. ఇంక మీ ఇష్టం అంటూ తుది హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 30లోపు ఈకేవైసీ
చేయించుకోకపోతే.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. అమలవుతాయని స్పష్టం చేసింది.
జిల్లాలో వివరాలు
మొత్తం గ్యాస్ ఏజెన్సీలు 62
సింగిల్ సిలిండర్ కనెక్షన్లు 2,24,604
డబుల్ సిలెండర్ కనెక్షన్లు 5,33,988
దీపం కనెక్షన్లు 1,31,749
మొత్తం కనెక్షన్లు 8,90,341
ప్రతి రోజూ డెలివరీలు 25 వేలు నుంచి
28 వేలు సిలెండర్లు
ఇప్పటివరకూ
ఈ–కేవైసీ జరిగింది 89 శాతం


