జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి

Sep 22 2026 1:12 AM | Updated on Sep 22 2026 1:12 AM

● 120 వార్డులు.. 1,955 పోలింగ్‌ స్టేషన్లు ● ఆర్వోలు, ఏఆర్వోలకు విధులు, బాధ్యతలపై అవగాహన అవసరం ● జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో పకడ్బందీగా సన్నద్ధం కావాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ సూచించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం రిటర్నింగ్‌ అధికారులు (ఆర్వోలు), అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు (ఏఆర్వోలు) చేపట్టాల్సిన విధులు, బాధ్యతలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ డీవీ రమణమూర్తి, మేయర్‌ ఎన్నికకు నియమితులైన స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ డాక్టర్‌ దయానిధి పాల్గొని ఎన్నికల నియమావళి, విధి విధానాలను వివరించారు. జీవీఎంసీ కార్యదర్శి బీవీ రమణ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఎన్నికల సన్నద్ధతపై వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో 120 వార్డులు, 1,955 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రతులను ఈ నెల 22న జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వార్డుల వారీగా ఓటర్ల సంఖ్య, పోలింగ్‌ స్టేషన్ల వివరాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి డూప్లికేషన్‌, మిస్సింగ్‌కు తావులేకుండా చూడాలన్నారు. పోలింగ్‌ స్టేషన్లలో మౌలిక సదుపాయాలపై ముందస్తు తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు 14 వేల మందికిపైగా సిబ్బంది అవసరమవుతారని పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్వోలు, జోనల్‌ కమిషనర్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. నూతన ఎన్నికల నియమావళి, మార్గదర్శకాలపై పూర్తి అవగాహనతో నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement