వైద్యం..
నిరుపేద నరకయాతన
ఉదయం ఆరు గంటలకే కేజీహెచ్‌కు చేరుకున్న ఒక పేద రోగి ఓపీ కోసం గంటల తరబడి క్యూలో నిల్చున్నాడు. మధ్యాహ్నం వరకు వేచి చూశాక గానీ డాక్టర్ దర్శనం కలగలేదు. అన్ని తిప్పలు పడి డాక్టర్‌ను కలిస్తే, అక్కడ రాసిన మందులలో సగం ఆస్పత్రి ఫార్మసీలో దొరకలేదు. ఆవేదనతో ఆ కుటుంబం అప్పుచేసి బయట మెడికల్ షాపుల్లో మందులు కొనాల్సి వచ్చింది. ప్రభుత్వాసుపత్రికి వస్తే ఈ ఆర్థిక భారమేంటి? అని ఆ కుటుంబం కంట నీరు పెట్టుకుంది. ఇది ఒక్కరి సమస్య కాదు.. కేజీహెచ్‌కు వస్తున్న వేలాది కుటుంబాల దైనందిక గాథ.
మహారాణిపేట : ఉదయం ఆస్పత్రి గేటు దాటగానే వందలాది మంది రోగులు.. ఓపీ కౌంటర్ వద్ద బారులు.. వైద్యుడి కోసం నిరీక్షణ.. మందుల కోసం మరో క్యూ.. వార్డుల్లో పరిశుభ్రతపై ఆందోళన.. ఇదీ ఉత్తరాంధ్రలోని పేద, మధ్యతరగతి ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న కింగ్‌జార్జి ఆస్పత్రి (కేజీహెచ్)లో నిత్య దృశ్యం. ప్రభుత్వాసుపత్రి కాబట్టి ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుందన్న ఆశతో వచ్చే రోగులకు కొన్ని చోట్ల ఎదురవుతున్న అనుభవాలు మాత్రం ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. సర్కారు ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న ఐవీఆర్‌ఎస్ సర్వేలో కేజీహెచ్‌పై నమోదైన గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఆరు నెలల స్పందనలను పరిశీలిస్తే ప్రతి అంశంలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా ఆస్పత్రి పారిశుధ్యంపై రోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ఉన్నతాధికారులు
స్పందించాల్సిందే..
కేజీహెచ్‌పై వస్తున్న ఈ ఐవీఆర్‌ఎస్ నివేదిక సాధారణ సంఖ్య కానే కాదు. ఇది వేలాది మంది పేదల ఆక్రందనలకు అద్దం పడుతున్న నిజం. అత్యంత సున్నితమైన వైద్య రంగంలో, అందునా నిరుపేదలు నమ్ముకున్న పెద్ద ఆస్పత్రిలో ఇలాంటి నిర్లక్ష్యం తగదు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి కేజీహెచ్ పాలనను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కేజీహెచ్‌లో రోగుల అవస్థలు వర్ణనాతీతం
ఐవీఆర్‌ఎస్ సర్వేలో విస్తుపోయే నిజాలు
వైద్యుడి కోసం నిరీక్షణ.. మందులకు బయట ఖర్చు.. లంచాలపై రోగుల ఆగ్రహం!


