ఏయూలో నిబంధనలకు పాతర
హైకోర్టుకు వెళ్లిన అధ్యాపకులపై కక్షసాధింపు
స్టే అమల్లో ఉన్నా నియామక ప్రక్రియ వేగవంతం
విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో తాత్కాలిక అధ్యాపకుల నియామక వ్యవహారం మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది. గతంలో పనిచేసి తొలగించబడిన అడ్జంక్ట్, అడ్‌హాక్ అధ్యాపకుల పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ, యాజమాన్యం కొత్తగా నియామక నోటిఫికేషన్ జారీ చేయడం క్యాంపస్‌లో కలకలం రేపుతోంది. కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతూ నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.
కోర్టును ఆశ్రయించడమే నేరమా?
తమ తొలగింపు అన్యాయమంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్న అధ్యాపకులపై ఏయూ పాలకవర్గం కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. కోర్టుకెళ్లిన అధ్యాపకులను ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించబోమని వీసీ స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతుండటం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు తీవ్ర వివాదాస్పదమైన ఈ ఇంటర్వ్యూల బాధ్యతను ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌కు అప్పగించడం ద్వారా ఆయన్ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఒకే వ్యవస్థ.. రెండు వింత నిబంధనలు!
గతంలో అడ్‌హాక్ అధ్యాపకుల నియామకాలపై విజిలెన్స్ విభాగం అభ్యంతరాలు తెలిపిందన్న కారణాన్ని చూపిస్తూ, ఇప్పుడు మళ్లీ అదే తరహా తాత్కాలిక నియామకాలు చేపట్టడం ఏ రకమైన న్యాయమని అధ్యాపక వర్గాలు నిలదీస్తున్నాయి. నియామక ప్రక్రియ ఒక్కటే అయినప్పుడు వ్యక్తులు మారినప్పుడల్లా నిబంధనలు ఎలా మారుతాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2019–2023 మధ్య కాలంలో నియమితులైన అధ్యాపకులపైనే కఠిన వైఖరి అవలంబిస్తూ, ఇతర కాలాల్లో జరిగిన సమానమైన నియామకాలను యథాతథంగా కొనసాగించడం స్పష్టమైన వివక్ష, పక్షపాతానికి నిదర్శనమని బాధిత వర్గాలు ఆరోపిస్తున్నాయి.
కోర్టు ధిక్కార పిటిషన్‌కు సిద్ధం!
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ నియామక నోటిఫికేషన్ విడుదల చేసిన ఏయూ యాజమాన్యం తీరుపై బాధిత అధ్యాపకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సమస్య తీవ్రతపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన బాధితులు, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు వైస్ ఛాన్సలర్‌తో పాటు ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్, జిల్లా కలెక్టర్‌లను ప్రతివాదులుగా చేరుస్తూ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఏయూ నుంచి తరలిపోతున్న స్టార్టప్‌లు
విద్యా ప్రమాణాలు పడిపోవడంతో నూతన ప్రవేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. విదేశీ విద్యార్థులు ప్రైవేట్ వర్సిటీల బాట పడుతుండగా, ఏయూలో కార్యకలాపాలు సాగిస్తున్న సుమారు 8 స్టార్టప్‌లు కూడా ఇతర డీమ్డ్ యూనివర్సిటీలకు తరలిపోయినట్లు తెలుస్తోంది. విశ్వవిద్యాలయ ప్రతిష్ట మసకబారుతున్న ఈ పరిస్థితులపై పాలకవర్గం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
ఫీజుల మోత.. బోధనలో కోత!
అధికారుల మొండి వైఖరి, అంతర్గత వివాదాల నడుమ ఇంజినీరింగ్ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. జూన్ 29న సెమిస్టర్ ప్రారంభమైనప్పటికీ, దాదాపు రెండు నెలలు గడుస్తున్నా సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ వంటి ప్రధాన విభాగాల్లో పలు కీలక సబ్జెక్టులకు నేటికీ క్లాసులు జరగడం లేదు. 2వ, 4వ, 6వ సెమిస్టర్ల టైమ్‌టేబుల్‌లో తరగతుల సమయాలు ఇంకా ఖాళీగానే దర్శనమిస్తుండటం విశ్వవిద్యాలయ పాలనా వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఒక్కో విద్యార్థి నుంచి సుమారు రూ.2 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తూ, సరైన బోధన అందించకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


