సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పేరిట మారికవలస గురుకులంలో కర్కశత్వం అర్ధరాత్రి 480 మంది విద్యార్థుల బలవంతపు తరలింపు ‘సారూ.. మమ్మల్ని ఇక్కడే చదువుకోనివ్వండి’ అంటూ కన్నీళ్లతో వేడుకోలు ‘మా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు?’ అంటూ తల్లిదండ్రుల ఆవేదన ప్రభుత్వ తీరుపై భగ్గుమన్న గిరిజన సంఘాలు, వైఎస్సార్‌సీపీ నేతలు
గురువారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2026
మధురవాడ: రాత్రి 10 గంటలు.. చుట్టూ చిమ్మచీకటి. గురుకుల వసతి గృహంలో రేపటి పాఠాల గురించి కలలు కంటూ నిద్రిస్తున్న గిరిజన బిడ్డలకు ఒక్కసారిగా బూట్ల చప్పుళ్లు, అధికారుల గద్దింపులు వినిపించాయి. ‘తెల్లారేసరికి స్కూల్ ఖాళీ చేయాలి.. బ్యాగులు సర్దుకోండి’ అంటూ హుకుం జారీ చేశారు. నిద్రమత్తులోనే పుస్తకాలు, దుస్తులు బ్యాగుల్లో సర్దుకున్న విద్యార్థులు.. ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమన్నారు. ‘సారూ.. మమ్మల్ని ఇక్కడే చదువుకోనివ్వండి’ అంటూ కొందరు చేతులు జోడించి వేడుకున్నా ఫలితం లేకపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కొండకోనల్లో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్లు చేసి ‘మీ పిల్లలను తరలిస్తున్నాం.. వెంటనే రండి’ అని సమాచారం ఇచ్చారు. వారు విశాఖ చేరుకునేలోపే 480 మంది విద్యార్థులను పోలీసుల పహారా మధ్య బస్సుల్లో ఎక్కించి సబ్బవరం, శ్రీకృష్ణాపురం, దేవరాపల్లి, పార్వతీపురం ప్రాంతాలకు తరలించారు. దీంతో మారికవలస–తిమ్మాపురం రోడ్డులోని గురుకుల ప్రాంగణం విద్యార్థుల ఆర్తనాదాలు, తల్లిదండ్రుల రోదనతో దద్దరిల్లింది.
చదువు కోసం దూరం నుంచి వచ్చిన బిడ్డలు
అరకు, పాడేరు, కొయ్యూరు, చింతపల్లి తదితర ఏజెన్సీ ప్రాంతాల కొండకోనల నుంచి వచ్చిన 480 మంది గిరిజన విద్యార్థులు మారికవలస గురుకులంలో చదువుకుంటున్నారు. మెరుగైన విద్య అందుతుందన్న ఆశతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ చేర్పించారు. అయితే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ) ఏర్పాటు కోసం ఈ పాఠశాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ పిల్లల చదువులపై అనిశ్చితి నెలకొంది. విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత కొద్దిరోజులుగా తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. పాఠశాలను ఇక్కడే కొనసాగించాలని, సీవోఈకి ప్రత్యామ్నాయ భవనం చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన పేరెంట్స్ సమావేశంలోనూ ఇదే విషయాన్ని తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారి అభ్యంతరాలను పక్కనపెట్టి మంగళవారం అర్ధరాత్రి అధికారులు, పోలీసులు పాఠశాలకు చేరుకోవడం తీవ్ర కలకలం రేపింది.
అర్ధరాత్రి ‘ఆపరేషన్’
రాత్రివేళ పాఠశాలకు చేరుకున్న అధికారులు, పోలీసులు గేట్లు మూసివేసి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశారు. బ్యాగులు సర్దుకోవాలని హుకుం జారీ చేశారు. నిద్రపోతున్న బిడ్డలను లేపి.. పుస్తకాలు, దుస్తులు సర్దించి.. తెల్లారేలోగా పాఠశాలను ఖాళీ చేయించారు. ఒంటిగంట దాటిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లోని తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పిల్లలను తరలిస్తున్నట్టు చెప్పారు. అప్పటికే రాత్రి కావడంతో దూర ప్రాంతాల నుంచి బయలుదేరడం తల్లిదండ్రులకు సాధ్యం కాలేదు. కొందరు అర్ధరాత్రే వాహనాల కోసం పరుగులు తీశారు. మరికొందరు ‘మా పిల్లల్ని మాకు చూపించండి.. మేమే వచ్చి తీసుకెళ్తాం’ అంటూ అధికారులను వేడుకున్నారు. కానీ అంతలోనే ప్రత్యేక బస్సులు సిద్ధమయ్యాయి. పోలీసుల పహారా మధ్య విద్యార్థులను బస్సుల్లోకి ఎక్కించి సబ్బవరం, శ్రీకృష్ణాపురం, దేవరాపల్లి, పార్వతీపురం తదితర ప్రాంతాలకు తరలించారు. బిడ్డల కన్నీళ్లు.. తల్లిదండ్రుల ఆర్తనాదాలు.. పోలీసుల పహారా.. అధికారుల హడావుడి.. వెరసి ఆ రాత్రి మారికవలస గురుకుల ప్రాంగణం ఓ విషాద దృశ్యాన్ని తలపించింది.
తల్లిదండ్రుల్లో ఆందోళన
పెంచి పెద్దచేసి మంచి చదువు అందించాలన్న ఆశతో కొండకోనల నుంచి వందల కిలోమీటర్ల దూరం పంపిన పిల్లలను అర్ధరాత్రి హడావుడిగా తరలించడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీవోఈ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గిరిజన, ప్రజాసంఘాలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు కూడా అధికారుల తీరుపై మండిపడ్డాయి. ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, సాంఘిక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సునీల్‌కుమార్ రాజా, సోషల్ వెల్ఫేర్ డీడీ రామకృష్ణ, డీఎస్‌టీడబ్ల్యూవో సురేష్‌ల పర్యవేక్షణలో తరలింపు జరిగినట్లు సమాచారం.
అమరావతిని ముట్టడిస్తాం..
విద్యా సంవత్సరం మధ్యలో విద్యార్థులను ఇలా రోడ్డున పడేయడం దారుణం. మొన్నటి పేరెంట్స్ మీటింగ్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ సమక్షంలో పిల్లలను ఇక్కడే ఉంచుతామని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే సహించేది లేదు. అవసరమైతే అమరావతి వరకు వెళ్లి సర్కారు మెడలు వంచుతాం.
– పూజారి గోవిందరావు, పీసా ఉపాధ్యక్షుడు


