ఆరిలోవ: విశాఖ నగర ప్రజల దాహార్తిని తీర్చే ముడసర్లోవ రిజర్వాయర్ దుర్భిక్ష ఛాయల్లో చిక్కుకుంది. ఎండల తీవ్రతకు తోడు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో జలాశయం నానాటికీ అడుగంటిపోతోంది. నీటి మట్టం పడిపోవడంతో రిజర్వాయర్ అడుగు భాగం బయటపడటమే కాకుండా పెద్ద బీటలు ఏర్పడ్డాయి. 2018లో పూర్తిగా ఎండిపోయి మైదానంగా మారిన దృశ్యాలను తలపిస్తోంది. రిజర్వాయర్‌లో నీటి మట్టం గణనీయంగా పడిపోవడంతో అక్కడక్కడా చిన్న గుంటల్లో మాత్రమే నీరు కనిపిస్తోంది. మిగిలిన విస్తీర్ణమంతా ఎండిపోయి నెర్రెలు చీలిన నేలను తలపిస్తోంది. అడుగున ఉన్న భారీ బండరాళ్లు సైతం వెలుగుచూశాయి. రిజర్వాయర్ పరిధిలో ఏర్పాటు చేసిన జీవీఎంసీ వాటర్ సోలార్ పలకలు సైతం అరకొరగా మిగిలిన నీటిలోనే కనిపిస్తున్నాయి. మరోవైపు నీరు లేని ప్రాంతాల్లో పశువులు మేతకు దిగుతున్నాయి.
170 అడుగుల సామర్థ్యం.. మిగిలింది 2.5 అడుగులే
ముడసర్లోవ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 170 అడుగులు. ప్రస్తుతం కేవలం 2.5 అడుగుల మేర నీరు మాత్రమే మిగిలి ఉన్నట్లు నీటి సరఫరా విభాగం అధికారులు చెబుతున్నారు. ఎండల తీవ్రత, వర్షాభావం ఇలాగే కొనసాగితే మిగిలిన నీరు సైతం వేగంగా ఆవిరయ్యే ప్రమాదం ఉందని పరిస్థితి స్పష్టం చేస్తోంది.
మళ్లీ 2018 నాటి దృశ్యాలు
2018లో ముడసర్లోవ రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోయింది. జలాశయం మైదానంగా మారడంతో అప్పట్లో కొందరు యువకులు అక్కడ బ్యాట్, బంతులతో క్రికెట్ ఆడిన దృశ్యాలను స్థానికులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మళ్లీ అదే దశకు చేరువవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరానికి తాగునీటి వనరుగా ఉన్న ముడసర్లోవలో నీటి నిల్వలు ఈ స్థాయిలో క్షీణించడం భవిష్యత్ నీటి అవసరాలపై ఆందోళన రేకెత్తిస్తోంది. వర్షాలు మరింత ఆలస్యమైతే రిజర్వాయర్‌లో మిగిలిన కొద్దిపాటి నీరు కూడా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు నిండుకుండలా కనిపించిన జలాశయం నేడు బీటలు వారిన నేలగా మారడం వర్షాభావ తీవ్రతకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.


