విచారణే అస్త్రం
ఏయూలో విచారణ పేరుతో అధికారుల బరితెగింపు ‘సంతోష’ంగా తెగబడి మరీ పిండుకుంటున్న వైనం కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, చిరుద్యోగులనూ వదలని వసూళ్ల పర్వం గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు పలువురు యోచన
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఓ వైపు లాభదాయకమైన డిఫెన్స్ కోర్సులను ఎత్తివేస్తూ ప్రైవేటు సంస్థలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు విచారణ పేరుతో అధికారుల వసూళ్ల పర్వం హద్దులు దాటుతోందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విభాగాల్లో తప్పులు జరిగాయని ఒప్పుకోవాలంటూ ఉద్యోగులపై ఒత్తిడి తేవడంతోపాటు.. అడిగిన మొత్తం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ల నుంచి ఇంజనీర్లు, చిరుద్యోగుల వరకు ఎవరినీ వదలకుండా విచారణను వసూళ్ల అస్త్రంగా మార్చుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ కాంట్రాక్టరు డబుల్ బిల్లులు తీసుకున్నారంటూ రికార్డుల్లో నమోదు చేసి, కేసులు పెడతామని బెదిరిస్తూ రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇదే తరహాలో ఇంజనీర్లు, చిరుద్యోగుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో ‘సంతోష’ంగా చక్రం తిప్పిన ఓ అధికారితోపాటు మరో ఉన్నతాధికారి అండదండలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై కొందరు ఆధారాలతో సహా గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
దిగజారుతున్న ఏయూ ప్రతిష్ట!
వాస్తవానికి ఏయూ ప్రతిష్టను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి వీసీ ప్రసాద్‌రెడ్డి కృషితో మరింత పెంచారనే అభిప్రాయం ఉంది. 2018లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఏయూలో డిఫెన్స్ స్టడీస్ సెంటర్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ కేంద్రంలో సైనికులు, సైనికాధికారులు ఉన్నత విద్య అభ్యసించారు. వైమానిక, నౌకా, భూసేనలతోపాటు ఐఎన్‌ఎస్ వంటి సంస్థలతో ఏయూ ఒప్పందాలు చేసుకుంది. వేలాది మంది రక్షణశాఖ సిబ్బంది డిగ్రీలు, పీహెచ్‌డీలు పూర్తి చేశారు. అగ్నివీరులకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపికై న తొలి విశ్వవిద్యాలయంగానూ ఏయూ గుర్తింపు పొందింది. 7 వేల మందికిపైగా సైనికులు ఇక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్టు వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి డిఫెన్స్ సెంటర్‌ను మూసివేయడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ నిరంజన్ రాజీనామా చేయగా.. సమన్వయకర్త ఉజ్వల్ వంటి నిపుణులు వర్సిటీని వీడారు. డిఫెన్స్ కోర్సులు నిలిచిపోవడంతో అడ్మిషన్లు గీతం వంటి ప్రైవేటు సంస్థలకు మళ్లేలా నిర్ణయాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ విచారణలు చేపట్టి.. ఆ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు చర్చనీయాంశమవుతున్నాయి. ‘ఇంటిని చక్కదిద్దాల్సింది పోయి గోడలు కూల్చిన చందంగా’ ఏయూ ప్రతిష్టను కాపాడాల్సినవారే సంస్థను మరింత అప్రతిష్టపాలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


