నాడు సరిహద్దుల్లో.. నేడు సమాజం కోసం! | - | Sakshi
Sakshi News home page

నాడు సరిహద్దుల్లో.. నేడు సమాజం కోసం!

Aug 15 2026 2:27 AM | Updated on Aug 15 2026 2:27 AM

● మన్ననలు అందుకుంటున్న నరవ మాజీ సైనికుల సేవా కార్యక్రమాలు ● 1998లో 12 మందితో ప్రారంభం.. నేడు 86 మంది సభ్యులతో సేవలు

గోపాలపట్నం: రేపటి తరానికి నేటి తరం ఆదర్శంగా నిలవాలన్నదే వారి లక్ష్యం. క్రమశిక్షణ, దేశభక్తి, పెద్దల పట్ల గౌరవం వంటి విలువలను యువతలో పెంపొందించేందుకు నరవ మాజీ సైనికులు కృషి చేస్తున్నారు. తమ సంక్షేమానికే పరిమితం కాకుండా ప్రజా సేవకు ప్రాధాన్యమిస్తున్నారు. జీవీఎంసీ 88వ వార్డు పరిధిలోని నరవలో మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం 1998లో 12 మందితో ప్రారంభమైంది. ప్రస్తుతం 86 మంది సభ్యులతో కొనసాగుతోంది.

యువతకు సైనిక శిక్షణ

దేశ రక్షణ రంగంలోకి యువతను ప్రోత్సహించేందుకు సంఘం ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. తెల్లవారుజామునే నిద్ర లేవడం, యోగా, రన్నింగ్‌, లాంగ్‌జంప్‌, హైజంప్‌ వంటి అంశాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. సైనిక నియామకాలు, పోటీ పరీక్షలకు సన్నద్ధతపైనా అవగాహన కల్పిస్తున్నారు. దీంతో యువతలో క్రమశిక్షణ పెరగడంతోపాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారని సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. కరోనా సమయంలోనూ సంఘం సభ్యులు విస్తృత సేవలందించారు. వైరస్‌ బారినపడిన పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మందులు అందించారు.

పలు యుద్ధాల్లో పాల్గొన్న వీరుల గ్రామం

నరవకు వీరోచిత చరిత్ర ఉంది. ఈ గ్రామానికి చెందిన పలువురు సైనికులు 1962 భారత్‌–చైనా యుద్ధం, 1965, 1971 భారత్‌–పాకిస్తాన్‌ యుద్ధాలతోపాటు 1967లో సిక్కింలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల్లో విధులు నిర్వర్తించారు. కార్గిల్‌ యుద్ధంలోనూ పలువురు సేవలందించారు. సంఘం అధ్యక్షుడు ఎం. సూర్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘మా గ్రామంలో సైనికులు ఎక్కువగా ఉండటంతో ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి పొందారు. దేశ రక్షణలో భాగస్వాములు కావడం గర్వంగా ఉంది. అదే స్ఫూర్తిని యువతలో నింపేందుకు కృషి చేస్తున్నాం. క్రమశిక్షణతో కూడిన యువతను తీర్చిదిద్దడమే మా లక్ష్యం’’ అని తెలిపారు.

సైనికుల సంక్షేమంతో పాటు సేవ

మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం సంఘాన్ని ఏర్పాటు చేశాం. సమాజం పట్ల కూడా మన బాధ్యత ఉందని భావించి ప్రజా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. యువతను సైనికులుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ అందిస్తున్నాం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సభ్యుల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం.

– చింతల రామారావు, మాజీ సైనికుడు

కార్గిల్‌ విజయోత్సవాల్లో పాల్గొన్నా

కార్గిల్‌ యుద్ధ సమయంలో జమ్ము నుంచి కార్గిల్‌ చేరుకునే సమయానికి యుద్ధం ముగిసింది. అనంతరం అక్కడ జరిగిన విజయోత్సవాల్లో పాల్గొన్నాం. అప్పట్లో మద్రాస్‌ ఇన్‌ఫెంట్రీ విభాగంలో విధులు నిర్వర్తించాను. దేశ రక్షణలో భాగంగా ఆ యుద్ధానికి సంబంధించిన విధుల్లో పాల్గొనడం నా జీవితంలో మరపురాని అనుభూతి.

– సాలాపు అప్పలనాయుడు, మాజీ సైనికుడు

కార్గిల్‌ విజయం సంతృప్తినిచ్చింది

‘కార్గిల్‌ యుద్ధంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. సాయుధ దళాలకు ఆయుధ సంపత్తిని అందించే బాధ్యతల్లో ఉన్నాను. శత్రువుల కంటపడకుండా ఆయుధాలు ముందుకు తీసుకెళ్లడం సవాల్‌తో కూడుకున్న పని. యుద్ధంలో ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమే. విజయం అనంతరం తగిన గౌరవం దక్కడం సంతృప్తినిచ్చింది.

– ముమ్మన అప్పారావు, మాజీ సైనికుడు

చైనా యుద్ధం పాఠాలు నేర్పింది

చైనాతో జరిగిన యుద్ధం భారత్‌కు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ఆ తర్వాత సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచుకుని శత్రువులకు దీటుగా సమాధానం ఇచ్చాం. ఆ పోరాటం నా సైనిక జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం.

– లింగం సూర్యనారాయణ, మాజీ సైనికుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement