పోలీస్ బ్యారెక్స్‌లో
ఏర్పాట్లు
మహారాణిపేట: విశాఖలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం ఉదయం 9 గంటలకు పోలీస్ బ్యారక్స్ స్టేడియంలో నిర్వహించే జిల్లా స్థాయి వేడుకల్లో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం స్వాతంత్య్ర దినోత్సవ సందేశం ఇవ్వనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే శకటాల ప్రదర్శన నిర్వహించనున్నారు. వివిధ పథకాల కింద 30,366 మంది లబ్ధిదారులకు రూ.397.33 కోట్ల విలువైన ఆస్తులు, ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేశారు. వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొననున్నారు. ఏర్పాట్లను కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి పర్యవేక్షించారు. కాగా జిల్లాలో 565 మంది అధికారులకు మెరిట్ అవార్డులు అందజేయనున్నారు.


