100 మీటర్ల జాతీయ జెండాతో కదం తొక్కిన విద్యార్థులు
మహారాణిపేట: బీచ్ రోడ్డు శుక్రవారం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నగరంలో దేశభక్తి స్ఫూర్తిని చాటిచెప్పింది. ‘వికసిత్ భారత్–స్వర్ణాంధ్ర–2047’ లక్ష్య సాధన, అభివృద్ధి చెందిన భారత నిర్మాణం థీమ్‌తో సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు సాగిన ర్యాలీని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులు, అధికారులు, ప్రజలతో కలిసి ర్యాలీలో కదం తొక్కారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాను చేతబట్టి ముందుకు సాగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘భారత్ మాతాకీ జై.. వందే మాతరం’ నినాదాలతో బీచ్ రోడ్డు దద్దరిల్లింది. కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారిణి జె.మాధవి, డీవీఎం జగదీష్, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమకుమార్,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


