మహారాణిపేట: డిసెంబర్ 2026 నాటికి జిల్లాలోని పాఠశాలలను అనీమియా రహితంగా తీర్చిదిద్దాలని ఇన్‌చార్జి కలెక్టర్, జేసీ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ‘12 ఇన్టూ 12’ క్యాంపెయిన్ అమలుపై సమీక్షించారు. 12 ఏళ్ల వయస్సు విద్యార్థుల్లో హిమోగ్లోబిన్ కనీసం 12 గ్రాములు ఉండేలా చూడాలని సూచించారు. రక్తహీనత ఉన్న విద్యార్థులకు ఐరన్ మాత్రలు క్రమం తప్పకుండా అందించడంతోపాటు, చిక్కీ, రాగిజావ వంటి పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో డీఈవో ప్రేమకుమార్, ఉప విద్యాశాఖాధికారి సోమేశ్వరరావు, ఎంఈవోలు, తదితరులు పాల్గొన్నారు.


