డాబాగార్డెన్స్: నగరంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు క్షేత్రస్థాయి పర్యవేక్షణ కొనసాగించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ బుధవారం టౌన్ సర్వీస్ రిజర్వాయర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నీటి సరఫరా ఎస్‌ఈ పల్లంరాజు, ఈఈ మురళీకృష్ణ, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించి ఇప్పటివరకు ఉచిత నీటి ట్యాంకర్ల వివరాలపై ఆరా తీశారు. మరో వారం రోజుల పాటు జీవీఎంసీ ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేయాలని స్పష్టం చేశారు.
84.44 ఎంజీడీ నీటి సరఫరా
ఏలేరు, గోదావరి, తాటిపూడి, రైవాడ, మేఘాద్రిగెడ్డ, గంభీరం, గోస్తని, శారదా నది జలవనరుల్లో నీటి మట్టాలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వీటి నుంచి జీవీఎంసీకి మొత్తంగా 84.44 ఎంజీడీ నీరు అందుతోందన్నారు. నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన డీసిల్టేషన్ పనులు పూర్తయితే నగరానికి అదనంగా సుమారు 3 ఎంజీడీ నీరు అందే అవకాశం ఉందన్నారు. నీటి సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ అవసరమైన ప్రాంతాలకు ఉచిత ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని ఆదేశించారు.


