బీచ్‌రోడ్డు: వీఎంఆర్‌డీఏలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ సంస్థ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని, లేదంటే కూటమి పెద్దలు అతడిని తప్పించాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వీఎంఆర్‌డీఏను అవినీతి కూపంగా మార్చారని ఆరోపించారు. భోగాపురం విమానాశ్రయానికి అనుసంధాన రహదారుల నిర్మాణంలో జాప్యంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ పేరుతో గంభీరంలో రెండు రహదారుల నిర్మాణాన్ని చేపట్టి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారని విమర్శించారు. వీఎంఆర్‌డీఏ కార్యాలయం సమీపంలోని చిల్డ్రన్స్ థియేటర్‌ని కూడా ప్రణవ్‌గోపాల్ బృందం కాసులు కురిపించే కామధేనువుగా మార్చేసుకుందని ధ్వజమెత్తారు. మంత్రి నారా లోకేష్‌కి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కళ్లు, ముక్కు, చెవులు తానేనని చెప్పుకుంటూ అందరినీ భయపెడుతున్నారన్నారు. తన మాట వినని అధికారులను కిలారి రాజేష్ పేరు చెప్పి బదిలీ చేయిస్తానంటూ హెచ్చరిస్తున్నారన్నారు. చైర్మన్ ప్రణవ్ గోపాల్ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి, ఆయన్ను తక్షణమే పదవి నుంచి తప్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


