కనకమహాలక్ష్మి ఆలయ చైర్మన్‌వి ఒంటెద్దు పోకడలు! | - | Sakshi
Sakshi News home page

కనకమహాలక్ష్మి ఆలయ చైర్మన్‌వి ఒంటెద్దు పోకడలు!

Aug 13 2026 12:27 AM | Updated on Aug 13 2026 12:27 AM

● చైర్మన్‌ ఏకపక్ష నిర్ణయాలపై పాలకమండలి అసంతృప్తి ● ఆలయ ఈవోకు ఫిర్యాదు చేసిన బురుజుపేట వాసులు

డాబాగార్డెన్స్‌: కనకమహాలక్ష్మి ఆలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ కందుల నాగరాజు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ వ్యవహారాల్లో పాలకమండలి సభ్యులు, అర్చకులు, సిబ్బందితో సమన్వయం లేకుండా నిర్ణయాలు తీసుకోవడంపై వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. చైర్మన్‌ తీరుతో ఆలయ పరిపాలనలో సమన్వయం కొరవడిందని పలువురు అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆలయ ప్రాంగణంలో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

పాలకమండలిలోనే వ్యతిరేకత

ప్రభుత్వం నియమించిన ఆలయ పాలకమండలి భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఆలయ నిర్వహణకు సంబంధించిన కీలక నిర్ణయాలను సభ్యులతో చర్చించి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కనకమహాలక్ష్మి ఆలయంలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. చైర్మన్‌ నిర్ణయాలపై సొంత పాలకమండలి సభ్యులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బురుజుపేట వాసులతో కలిసి కొందరు పాలకమండలి సభ్యులు ఆలయ ఈవోకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

విగ్రహాన్ని పోలిన మరో విగ్రహం?

వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కనకమహాలక్ష్మి ఆలయానికి ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉన్నాయని భక్తులు చెబుతున్నారు. బురుజుపేట పూర్వీకులు బావిలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తాళ్ల సాయంతో వెలికితీసి, ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి అమ్మవారికి నిత్యం త్రికాల పూజలు, పసుపు, కుంకుమ, పాలు, నారికేళ జలాలతో అభిషేకాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గర్భాలయంలోని అమ్మవారి విగ్రహాన్ని పోలిన మరో విగ్రహాన్ని ఆమె వెనుక భాగంలో ఏర్పాటు చేయాలని, ఆలయ ప్రాంగణంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదనను కొందరు పాలకమండలి సభ్యులు వ్యతిరేకించినట్లు తెలిసింది.

ఆగమ శాస్త్రానికి విరుద్ధమా?

కనకమహాలక్ష్మి ఆలయంలో ఉప ఆలయాలు ఏర్పాటు చేయడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని పలువురు పండితులు అభిప్రాయపడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతి ఏడాది వినాయకచవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఐదు రోజులపాటు పూజలు నిర్వహించే సంప్రదాయం ఉందని, శాశ్వతంగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించడం ఆచారాలకు భిన్నమని వారు పేర్కొంటున్నారు. అమ్మవారి ఆలయ ప్రత్యేకత, సంప్రదాయాలు, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని గర్భాలయంలో ఇతర దేవతల విగ్రహాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని బురుజుపేట వాసులు కోరుతున్నారు.

ఇప్పటికే వివాదాస్పద ఘటనలు

ఆలయ పవిత్రత, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ఉన్న చైర్మన్‌ గత జూన్‌లో పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించారంటూ అప్పట్లో వివాదం నెలకొంది. ఈ ఘటనపై భక్తుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అనంతరం చైర్మన్‌, ఆలయ ఈవో, సిబ్బంది మధ్య సమన్వయం మరింత దెబ్బతిన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా విగ్రహాల ఏర్పాటు అంశం తెరపైకి రావడంతో మరోసారి వివాదం నెలకొంది. పాలకమండలి సభ్యుల అభ్యంతరాలు, భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement