ఆరిలోవ: గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రీన్ విశాఖ ఆధ్వర్యంలో ముడసర్లోవ వాకర్స్‌తో కలిసి నిరసన చేపట్టారు. ముడసర్లోవ వాకర్స్ క్లబ్ సభ్యులు, నడకకు వచ్చిన మహిళలు గ్రీన్ విశాఖ ప్రతినిధులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ‘ముడసర్లోవ జలాశయాన్ని కాపాడుకుందాం’, ‘ప్రాణాలకు ముప్పు కలిగించే గూగుల్ డేటా సెంటర్ మాకొద్దు’, ‘పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అంటూ నినదించారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో స్థానికంగా ఎదురయ్యే పరిణామాలు, పర్యావరణానికి కలిగే ముప్పు గురించి గ్రీన్ విశాఖ ప్రతినిధులు వివరించారు. పర్యావరణానికి హాని కలిగించే డేటా సెంటర్ ఏర్పాటును ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. పచ్చదనాన్ని కాపాడుకునేందుకు, డేటా సెంటర్ ప్రతిపాదనను రద్దు చేసే వరకు పోరాడతామని తెలిపారు. కార్యక్రమంలో గ్రీన్ విశాఖ ప్రతినిధులు రామమోహన్‌రావు, కాంతారావు పాల్గొన్నారు.


