అల్లిపురం: బ్యాంకు మోసాలు, సైబర్ నేరాల దర్యాప్తులో అధికారుల నైపుణ్యాలను మరింత పెంపొందించేందుకు సీఐడీ విశాఖ ప్రాంతీయ కార్యాలయంలో గురువారం ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. సీఐడీ డీజీ డాక్టర్ ఎ.రవిశంకర్ మార్గదర్శకత్వంలో, ఎస్పీ ఎస్.శ్రీధర్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ డాక్టర్ జి.ప్రేమ్‌కాజల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సైబర్ నిపుణుడు వి.నరసింహారావు, ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ వి.సూర్యప్రకాశ్, మాజీ సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.రామకృష్ణ బ్యాంకు మోసాలు, సైబర్ నేరాల నివారణ, దర్యాప్తు విధానాలు, డిజిటల్ సాక్ష్యాల సేకరణ, చట్టపరమైన అంశాలపై అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. శిక్షణలో సీఐడీ విశాఖ ప్రాంతీయ కార్యాలయానికి చెందిన డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది పాల్గొని సైబర్ నేరాల దర్యాప్తుకు సంబంధించిన ఆధునిక విధానాలను తెలుసుకుని తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు.


