మహానగరం దాహం.. దాహం! | - | Sakshi
Sakshi News home page

మహానగరం దాహం.. దాహం!

Aug 7 2026 12:38 AM | Updated on Aug 7 2026 12:38 AM

చుక్క నీటి కోసం చచ్చే తిప్పలు

తాగునీటికి అల్లాడుతున్న ప్రజానీకం

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని

యంత్రాంగం

ట్యాంకర్లు అడిగితే లేవనే సమాధానం

ఇప్పుడు డయల్‌ యువర్‌ ట్యాంకర్‌

అంటూ హడావుడి

డాబాగార్డెన్స్‌: మహానగరంలో ‘దాహం’ కేకలు మిన్నంటుతున్నాయి. జీవీఎంసీ పరిధిలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చి, ప్రజల గొంతులు ఎండుతున్నాయి. నగర ప్రజలకు సరిపడా నీళ్లు అందించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఎల్‌నీనో ప్రభావంతో జలాశయాల్లోనూ నీటి మట్టాలు గణనీయంగా పడిపోయాయి. ఫలితంగా కొళాయిల నుంచి నీరు రాక, జనం చుక్క నీటి కోసం రోడ్లపై బిందెలతో పడిగాపులు కాయాల్సి వస్తోంది.

బాకా ఊదడమే.. ప్రత్యామ్నాయం శూన్యం

విశాఖ నగరానికి ప్రధానంగా ఏలేరు, గోదావరి, రైవాడ, తాటిపూడి, మేహాద్రిగెడ్డ జలాశయాల నుంచే తాగునీరు సరఫరా అవుతోంది. ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయంటూ రోజూ ప్రగల్భాలు పలికే జీవీఎంసీ అధికారులు.. క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను మాత్రం చేయలేక చేతులెత్తేశారు. తాగునీరు పుష్కలంగా ఉందంటూ ఒకవైపు బాకా కొడుతున్న అధికారులు.. సమస్య జఠిలమయ్యాక ఇప్పుడు సమీక్షలతో హడావుడి చేస్తున్నారు.

పాతాళంలో భూగర్భ జలాలు

ఆరిలోవ, ఎండాడ, మధురవాడ, రుషికొండ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. అడ్డూ అదుపూ లేని కాంక్రీట్‌ కట్టడాలు పెరిగిపోవడం, వర్షపు నీరు ఇంకే మార్గం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. శివార్లే కాకుండా, నగర నడిబొడ్డున కూడా ప్రజలు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. వేసవి దాటి వర్షాకాలం వచ్చినా ఎండల తీవ్రత తగ్గకపోవడంతో నీటి వినియోగం ఊహించని రీతిలో పెరిగింది. పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా అధికారులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాంకర్లు అడిగితే ‘లేవు’ అనే సమాధానం!

నగరంలో నీటి కొరత తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాల్సిన అధికారులు, ‘నీరు లేదు’ అని చేతులెత్తేస్తుండటంతో ప్రజలు తీవ్ర వేదనకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల నిత్యం జనం పనులన్నీ పక్కనబెట్టి నీటి కోసమే రోడ్లపై సమయం వృథా చేయాల్సి వస్తోంది.

ట్యాంకర్‌ బుకింగ్‌ కోసం

టోల్‌ఫ్రీ నెంబర్‌

ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయంగా టీఎస్‌ఆర్‌ కాల్‌ సెంటర్‌ ద్వారా ట్యాంకర్‌ బుకింగ్‌ సౌకర్యం కల్పించాం. ట్యాంకర్‌ బుకింగ్‌ కోసం టోల్‌ఫ్రీ నంబరు 1800 4250 0009ను సంప్రదించాలి. ఈ సేవలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. భీమిలి జోన్‌ నుంచి అనకాపల్లి జోన్‌ వరకు ఉన్న 11 ఫిల్లింగ్‌ పాయింట్ల ద్వారా తాగునీటి ట్యాంకర్‌ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ‘డయల్‌–ఏ–ట్యాంకర్‌’ సేవలకు నగర ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. తొలి రోజే సాయంత్రం 7 గంటల వరకు 245 ట్యాంకర్‌ బుకింగ్‌లు నమోదయ్యాయి. ప్రజలు ఇంటి నుంచే మొబైల్‌ లేదా కంప్యూటర్‌ ద్వారా ట్యాంకర్‌ బుక్‌ చేసుకునేలా మరో ఒకటి, రెండు రోజుల్లో ఆన్‌లైన్‌ బుకింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. బుకింగ్‌లు ‘ఫస్ట్‌ ఇన్‌–ఫస్ట్‌ అవుట్‌’ విధానంలో పూర్తిగా పారదర్శకంగా కేటాయిస్తాం.

– కేతన్‌ గార్గ్‌, కమిషనర్‌, జీవీఎంసీ

పాలకులు మాటలు మంచినీళ్లలా పారిస్తున్నారు. అధికారులు కాగితాల్లో రిజర్వాయర్లను పొంగిపొర్లిస్తున్నారు. తీరా కుళాయి తిప్పితే చుక్క నీరు రాక.. గాలొచ్చి వెక్కిరిస్తోంది! ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేశాడు. వర్షాకాలంలో కూడా భానుడి భగభగలకు భూగర్భ జలాలు పాతాళంలో దాక్కున్నాయి. కుళాయిలు ఎండిపోవడం.. బోర్లు మూగబోవడం.. ట్యాంకర్లు రాకపోవడంతో మహిళలు వీధుల్లో సమరశంఖం పూరిస్తున్నారు. ముందస్తు ప్రణాళికలను గాలికొదిలేసిన అధికారులు.. ఇప్పుడు సమస్య జఠిలమయ్యాక ‘కాల్‌ సెంటర్లు.. సమీక్షలు’ అంటూ హడావుడి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement