20 కేజీల వెండి, 10 గ్రాముల బంగారం అపహరణ
మధురవాడ: మధురవాడ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బంగారం దుకాణంలో భారీ చోరీ జరిగింది. పీఎంపాలెం క్రైమ్ ఇన్‌స్పెక్టర్ బీఎస్‌ఎస్ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడ జోన్ కార్యాలయం ఎదురుగా డైలీ మార్కెట్‌లోని కొల్లి కాంప్లెక్స్‌లో ఉన్న రామ్మోహననాయుడు జ్యుయలరీ షాపులో మంగళవారం రాత్రి దొంగలు దోచుకెళ్లారు. బుధవారం ఉదయం దుకాణం తెరిచిన యజమాని షాపు వెనుక గోడకు రంధ్రం ఉన్న విషయాన్ని గమనించాడు. అగంతకుడు గోడను పగలగొట్టి షాపు లోపలికి ప్రవేశించి ఆభరణాలు చోరీ చేసినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి క్రైమ్ ఏసీపీ వెంకటరావు, ఇతర అధికారులు చేరుకుని విచారణ చేపట్టారు. దుకాణంలో ఉన్న 20 కేజీల వెండి, మరో రూ.1.50 లక్షల విలువైన 10 గ్రాముల లక్ష్మీ కాసులు, ఇతర వస్తువులు మొత్తంగా రూ.45 లక్షల విలువైన సొత్తును అపహరించినట్లు యజమాని తెలిపారు. బంగారు లాకర్ తెరుచుకోకపోవడంతో అందులోని బంగారు ఆభరణాలు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిందితుడు తెలివిగా దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలు, ఇతర సామగ్రిని కూడా తీసుకెళ్లడంతో ఆధారాలు లభించలేదు. దీంతో సమీప దుకాణాల సీసీ కెమెరాలు పరిశీలించగా, నిందితుడు స్కూటీపై వచ్చి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


