రెండున్నర గంటలపాటు రహదారి మూసివేత
విద్యార్థులు, ఉపాధ్యాయులు
నడుచుకుంటూ పాఠశాలకు
‘మీటింగ్’ పేరుతో
డ్వాక్రా మహిళలకు చుక్కలు
ఆరిలోవ: మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా బుధవారం ఆరిలోవలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పెదగదిలి జంక్షన్ నుంచి తోటగరువు వరకు బీఆర్‌టీఎస్ డబుల్ రోడ్డును ఉదయం 9 నుంచి 11.30 వరకు పూర్తిగా మూసివేశారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించలేక వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లే ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ వాహనాలను పెదగదిలి వద్ద నిలిపి సుమారు అర కిలోమీటర్ నడుచుకుంటూ పాఠశాలకు చేరుకోవాల్సి వచ్చింది. అకాడమీ సమీపంలోని ఆరిలోవ రైతుబజార్‌కు కూడా ఉదయం 11 గంటలు దాటే వరకు వినియోగదారులను అనుమతించకపోవడంతో వ్యాపారులు, స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ ఉదయం 10 గంటలకు కార్యక్రమానికి చేరుకుని సుమారు గంటన్నర పాటు అక్కడే ఉన్నారు. అయితే ఆయన రాకకు గంట ముందుగానే పోలీసులు రహదారిని మూసివేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీటింగ్ పేరుతో పిలిచి..
మంత్రి లోకేష్ పర్యటనలో డ్వాక్రా మహిళలకు చుక్కలు చూపించారు. మంత్రి లోకేష్ ప్రజలతో సమావేశం నిర్వహిస్తారని చెప్పి డ్వాక్రా మహిళలను తప్పనిసరిగా హాజరుకావాలని టీడీపీ నాయకులు, ఆర్‌పీల ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఉదయం 8.30 గంటల నుంచే కార్యక్రమం వద్దకు చేరుకుని వేచి చూశారు. మంత్రి రాగానే పూలు చల్లి స్వాగతం పలికించారు. అనంతరం సమావేశానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సమావేశం లేదని, స్వాగత కార్యక్రమం ముగిసిందని చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఈమాత్రం దానికి ఉదయం నుంచి ఎండలో ఎందుకు ఉంచారని మహిళలు మండిపడ్డారు.


