వ్యాపార వివాదాన్ని ‘కిడ్నాప్’గా
వక్రీకరించారు
కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారు
వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం నాయకులు జహీర్ అహ్మద్, భర్కత్ అలీ
మహారాణిపేట: వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై నమోదు చేసిన కిడ్నాప్ కేసు పూర్తిగా రాజకీయ కక్షసాధింపులో భాగమేనని పార్టీ మైనార్టీ విభాగం నాయకులు జహీర్ అహ్మద్, భర్కత్ అలీ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మైనార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతోందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయిస్తోందని విమర్శించారు. బుధవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా చాలా కాలంగా పొగాకు వ్యాపారం చేస్తున్నారని, పొగాకు కొనుగోలు కోసం సూర్యచంద్రరావు అనే వ్యాపారికి రూ.30 లక్షలు చెల్లించినప్పటికీ సరుకును సరఫరా చేయకుండా మరో వ్యక్తికి తరలించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ముస్తఫా కుమారుడు, ఇతరులు పొగాకుతో వెళ్తున్న లారీని అడ్డుకుని పెదకాకాని పోలీస్ స్టేషన్‌కు అప్పగించారని చెప్పారు. అనంతరం డబ్బులు తీసుకుని సరుకు ఇవ్వకపోవడంపై సంబంధిత వ్యక్తులను గుంటూరుకు తీసుకువచ్చి మాట్లాడారని, డబ్బులు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు గుర్తించి వారినే పోలీసులకు అప్పగించారని వివరించారు.
కిడ్నాప్‌గా వక్రీకరించి..
అయితే ఈ వ్యాపార లావాదేవీల వివాదాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా ‘కిడ్నాప్’గా ప్రచారం చేసి, ముస్తఫా, ఆయన కుమారుడు, కుటుంబ సభ్యులు, అనుచరులపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారని ఆరోపించారు. నిజంగా కిడ్నాప్ చేయాలనే ఉద్దేశం ఉంటే సంబంధిత వ్యక్తులను పోలీసులకు ఎందుకు అప్పగిస్తారని ప్రశ్నించారు. జీవీఎంసీ మాజీ కో–ఆప్షన్ సభ్యుడు ఎండీ షరీఫ్ మాట్లాడుతూ, సమగ్ర విచారణ లేకుండానే మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఈ సమావేశంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఆర్‌టీఐ విభాగం అధ్యక్షుడు ఎస్.కె.బాబ్జి పాల్గొన్నారు.


