తగరపువలస: ఆటో బోల్తాపడిన ఘటనలో ప్రమాదానికి ఏమాత్రం సంబంధం లేని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దొరతోట రోడ్డులో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దొరతోట రోడ్డులో పక్కుర్తి లక్ష్మణ్ (40) రోడ్డుపక్కన విద్యుత్ స్తంభం వద్ద మూత్ర విసర్జన చేస్తున్నాడు. అదే సమయంలో ఆనందపురం క్రాస్‌రోడ్డు నుంచి భీమిలి వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. బోల్తాపడిన ఆటో లక్ష్మణ్‌పై పడటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్‌ను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య రామయ్యమ్మ, కుమారుడు రవి, కుమార్తె హేమ ఉన్నారు. ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


