పంచాయతీల్లో మూడు నెలలుగా జీతాల్లేక అవస్థలు
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో 1,100కు పైగా కార్మికుల ఆవేదన
బకాయి జీతాలతో పాటు జీవో 680 అమలుకు డిమాండ్
మహారాణిపేట: నెలల తరబడి జీతాలు అందక గ్రామ పంచాయతీ, స్వచ్ఛభారత్, క్లాప్ మిత్ర పారిశుధ్య కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని వందలాది కార్మికులు కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో థర్డ్ పార్టీ కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కనీస వేతనాలతో పాటు అవుట్‌సోర్సింగ్ కార్పొరేషన్‌లో తమను విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
అరకొర జీతాలు.. నెలనెలా రావు
విశాఖ జిల్లాలోని 79 గ్రామ పంచాయతీల్లో సుమారు 240 మంది, అనకాపల్లి జిల్లాలోని 645 పంచాయతీల్లో సుమారు 900 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి నెలకు ఇచ్చేది కేవలం రూ.6 వేలు మాత్రమే. అది కూడా గత మూడు నెలలుగా ఇవ్వలేదు. ఈ అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న తమకు నెలల తరబడి జీతాలివ్వకపోతే.. కుటుంబంతో బతికేదెలా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిశుభ్రతకు అవార్డులు.. కార్మికులకు వెతలు
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించేది పారిశుధ్య కార్మికులే. కరోనా సమయంలో వీరి సేవలు అసమానం. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీధులు, కాల్వలు శుభ్రం చేయడంతోపాటు, అధికారుల సూచన మేరకు ఇతర పారిశుధ్య పనులు కూడా నిర్వర్తిస్తున్నారు. దీంతో ప్రభుత్వాల నుంచి పంచాయతీలు అవార్డులు పొందుతున్నాయి. అయినా వీరి జీతాల కోసం అధికారులు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. పీజీఆర్‌ఎస్ ద్వారా జీతాల బకాయిలపై వినతులు సమర్పించినా స్పందించట్లేదని ఆక్షేపిస్తున్నారు.
కనీస వేతనాలివ్వాలి
పంచాయతీ పారిశుధ్య కార్మికుల కరోనా టైంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబ సభ్యుల్ని వదిలి పనిచేశారు. ఆ కనికరం కూడా అధికారులు చూపట్లేదు. మా జీతాలు కొంచెం అయినా పెంచిన దాఖలాల్లేవు. కార్మి కులకు కనీస వేతనంగా రూ.26 వేలు చెల్లించాలి.
–పడాల రమణ, జిల్లా గౌరవ అధ్యక్షుడు, ఏపీ గ్రామ పంచాయితీ, స్వచ్ఛభారత్ వర్కర్స్ యూనియన్
జీవో 680 అమలు చేయాలి
పంచాయతీ కార్మికులకు జీవో నం.680 అమలు చేసి నెలకు రూ.10 వేల జీతం ఇవ్వాలి. డీపీవో లేదా ఎంపీడీవో ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ప్రమాదం, సహజ మరణం పొందిన కార్మికులకు మట్టి ఖర్చులిచ్చి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి.
–సీహెచ్ శంకర్, కార్మికుడు, శొంఠ్యాం, ఆనందపురం
కార్మిక చట్టాలు అమలు చేయాలి
మేజర్ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేసి, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలి. పంచాయతీలో పనిచేస్తున్న శానిటేషన్, వాటర్ సప్లై, ఎలక్ట్రికల్ కార్మికులకు బీమా వర్తింపజేయాలి. పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రభుత్వమే జీతాలివ్వాలి.
–ఎద్దు పైడమ్మ, పాండ్రింగి, పద్మనాభం
గత ప్రభుత్వంలో భరోసా
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించింది. రూ.6 వేల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతూ జీవో నం.680 జారీ చేసింది. అది అమల్లోకి రాకముందే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం ఈ ఉత్తర్వులను పక్కన పెట్టేసింది. మరోవైపు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి జీతాలు చెల్లించాలని ఉత్తర్వులు ఉన్నప్పటికీ అమలు చేయట్లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. జీతాలు అడిగితే పనులు మానుకుని, వెళ్లిపోండని బెదిరిస్తున్నారని వాపోతున్నారు.


