ఆరిలోవ: ఇద్దరు చిన్నారులు జూలోని వన్యప్రాణులను దత్తత తీసుకొని ఆదర్శంగా నిలిచారు. ఆదివారం చిన్నారులు సహారి, ఆర్యన్ తమ తల్లిదండ్రులతో కలిసి జూను సందర్శించి ఒక ఘరియల్, రెండు రాక్ పైథాన్‌లు (కొండచిలువలు)ను ఏడాది కాలానికి, ఒక మకావ్ పక్షిని నెల రోజుల పాటు దత్తత తీసుకున్నారు. ఇందుకోసం ఘరియల్‌కు రూ.25 వేలు, రెండు పైథాన్‌లకు రూ.10 వేలు, మకావ్ పక్షికి నెలకు రూ.240 చొప్పున విరాళాన్ని జూ క్యూరేటర్ జి. మంగమ్మకు అందజేశారు. అనంతరం ఆమె చిన్నారులకు దత్తత స్వీకార పత్రం, సావనీర్‌ను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మరింత మంది దాతలు వన్యప్రాణులను దత్తత తీసుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు శ్వేత, అనిల్, జూ అసిస్టెంట్ క్యూరేటర్లు బి. గోపి, పి.వి. చౌదరి, సిబ్బంది పాల్గొన్నారు.


