పరవాడ: యలమంచిలి–పరవాడ రహదారిలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. పరవాడ సీఐ ఎల్.భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీఈపీడీసీఎల్‌లోని లంకెలపాలెం సెక్షన్‌లో కాంట్రాక్టు లైన్‌మన్‌గా పనిచేస్తున్న దుర్గారావు విధుల నిర్వహణకు ఆదివారం వాడచీపురుపల్లి ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి పరవాడకు వస్తుండగా పైడిమాంబ ఆలయం సమీపంలో గాజువాక నుంచి అచ్యుతాపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆయన బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గారావు తలకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పరవాడ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.


