సీతంపేట: విశాఖపట్నంలోని ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల హారోల్డ్ రిడ్లీ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఆఫ్తాల్మాలజీ ఫొటో ఎగ్జిబిషన్–2026 విశేషంగా ఆకట్టుకుంది. ఆఫ్తాల్మాలజీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం పోటీ రూపంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని 10 వైద్య కళాశాలలు, ఐదు పోస్ట్‌గ్రాడ్యుయేట్ శిక్షణా సంస్థలకు చెందిన సుమారు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ వి.వి.ఎల్.నరసింహారావు ప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమాన్ని డా.అజయ్ శంకర్ నిర్వహించగా, ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్, ఆఫ్తాల్మాలజీ విభాగాధిపతి డాక్టర్ వి.మీనాక్షి పర్యవేక్షించారు. ప్రదర్శనలో అరుదైన నేత్ర వ్యాధులు, క్లిష్టమైన వైద్య పరిస్థితులకు సంబంధించిన అత్యుత్తమ క్లినికల్ ఫొటోగ్రాఫ్‌లను ప్రదర్శించగా, సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సుమారు 100 మంది నేత్ర వైద్య నిపుణులు, 50 మంది పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రముఖ నేత్ర వైద్యులు సి.వి.గోపాలరాజు, బి.ధర్మరాజు, యు.ఎస్.ఎన్.మూర్తి, ఎం.ఎస్.ఆర్.మూర్తి, టి.జ్యోతిర్మయి, భాస్కరరావు, తారకేశ్వరరావు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.


