మహారాణిపేట: ఎర్రజెండాల రెపరెపలు.. నినాదాలతో దద్దరిల్లిన వీధులు.. చేతుల్లో చిన్నారులను ఎత్తుకుని ఉద్యమంలో అడుగులు వేసిన మహిళలు.. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆశ, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకం, వీవోఏ, ఆర్‌పీ, స్కూల్ శానిటేషన్ కార్మికులు శుక్రవారం నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సరస్వతి పార్కు నుంచి డాబాగార్డెన్స్, ప్రకాశరావుపేట, జగదాంబ జంక్షన్, వాచ్ హౌస్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ముందుజాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పి.మణి మాట్లాడుతూ స్కీం వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని, పనిభారం తగ్గించాలని, వేధింపులు నిలిపివేయాలని, అనవసర యాప్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా వేతనాలు పెరగకపోయినా.. నిత్యావసర వస్తువులు, ఇంటి అద్దెలు, విద్యుత్, రవాణా, విద్యా ఖర్చులు భారీగా పెరిగాయన్నారు. కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చే ప్రభుత్వం ప్రజలకు సేవలందిస్తున్న స్కీం వర్కర్ల వేతనాల పెంపును నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. వేతనాలు పెంచే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్ మాట్లాడుతూ స్కీం వర్కర్లపై పనిభారం, అధికారుల వేధింపులు పెరిగాయని, అనవసర యాప్‌లతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో స్కీం వర్కర్ల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిందని విమర్శించారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సభలకు జనాలను తరలించడమే వీరి పనిగా మారిందన్నారు. ఈ సభకు శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా సహ–కన్వీనర్ ఎ.సీతాలక్ష్మి అధ్యక్షత వహించగా.. అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వెంకటలక్ష్మి, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎస్.పద్మ, మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.మంగశ్రీ, ఆర్‌పీ యూనియన్ జిల్లా కార్యదర్శి జి.ఝాన్సీ, వీవోఏ సంఘం జిల్లా కార్యదర్శి అపర్ణ, స్కూల్ శానిటేషన్ వర్కర్స్ నాయకురాలు లక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.జగన్ తదితరులు ప్రసంగించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, ఇతర కార్మిక సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు.


