మహారాణిపేట: భోగాపురం విమానాశ్రయం శనివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో, జీవీఎంసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్కే బీచ్ వద్ద ‘ప్రౌడ్లీ వైజాగ్’ థీమ్‌తో మెగా ఫ్లాష్‌మాబ్, కార్నివాల్, సాంస్కృతిక ప్రదర్శనలు, మెగా బీచ్ వాక్‌ను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ముఖ్య అతిథిగా హాజరై, జీవీఎంసీ అదనపు కమిషనర్ పి.ఎం.సత్యవేణి, యూసీడీ పీడీ బి.వి.రమణతో కలిసి మెగా ఫ్లాష్‌మాబ్‌ను ప్రారంభించారు. అనంతరం మెగా బీచ్ వాక్‌కు జెండా ఊపి శ్రీకారం చుట్టి, ప్రజలతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని, ఉపాధి, పెట్టుబడులు, పర్యాటక రంగాలకు కొత్త అవకాశాలు తీసుకురానుందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్నివాల్, ఫ్లాష్‌మాబ్, కర్రసాము, కత్తిసాము, కళరి, చిన్నారుల కిక్‌బాక్సింగ్ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
బీచ్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న కలెక్టర్ కారు
బీచ్‌వాక్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కలెక్టర్ కారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఇందులో కలెక్టర్ కారు చాలాసేపు నిలిచిపోయింది. అక్కడ కనీసం ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా లేకపోవడంతో, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఇద్దరు స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ప్రజల భాగస్వామ్యంపై విమర్శలు
అయితే ‘ప్రౌడ్లీ వైజాగ్’ పేరిట నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రైవేట్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు అప్పగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ప్రజల భాగస్వామ్యం లేకుండా పోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఫ్లాష్‌మాబ్‌ను స్థానిక విద్యార్థులు, యువతతో నిర్వహించి ఉంటే మరింత సహజత్వం, ప్రజల అనుబంధం కనిపించేదని పలువురు భావిస్తున్నారు.


