ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల విశాఖలో ప్రస్తుత ఓటర్ల సంఖ్య 17,82,800 పెరిగిన పోలింగ్ కేంద్రాలు ఈ నెల 30 వరకు దరఖాస్తుకు అవకాశం
మహారాణిపేట: విశాఖపట్నం జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్)–2026 ప్రక్రియ ముగిసింది. ఇందులో భాగంగా జిల్లాకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ శుక్రవారం విడుదల చేశారు. జిల్లాలోని మొత్తం 1,980 పోలింగ్ స్టేషన్ల పరిధిలో గతంలో 20,23,009 మంది ఓటర్లు ఉండగా.. వివిధ కారణాల వల్ల 2,40,209 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఫలితంగా జిల్లాలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 17,82,800కు చేరింది. కాగా జిల్లాలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో 1,980 ఉండగా, ఆ సంఖ్య 2,143కు చేరుకుంది.
ఏఎస్‌డీడీ కేటగిరీ కింద తొలగింపు
ఓటర్ల వెరిఫికేషన్‌లో భాగంగా ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్, డూప్లికేట్ (ఏఎస్‌డీడీ) కేటగిరీల్లో ఉన్న 2,40,209 ఓటర్ల వివరాలను జాబితా నుంచి తొలగించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో అత్యధికంగా వలస వెళ్లిన వారు (షిఫ్టెడ్) 1,14,582 మంది ఉండగా, మరణించిన వారు 54,230 మంది, నకిలీ ఓట్లు 39,451, ఆబ్సెంట్/అన్‌ట్రేసబుల్‌గా 30,658 మంది, ఇతరులు 1,288 మంది ఉన్నారు.
మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు
ముసాయిదా జాబితా ప్రచురణ అనంతరం ప్రతి ఓటరూ తమ పేరు, వివరాలను సరిచూసుకోవాలి. ఒకవేళ అర్హత ఉండి జాబితాలో పేరు లేకపోయినా, లేదా తొలగించినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్తగా పేరు నమోదుకు ఫారం–6 ద్వారా, వివరాల మార్పులు లేదా సవరణల కోసం ఫారం–8 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను ఈ నెల 30వ తేదీ వరకు సమర్పించే అవకాశం ఉంది.
– ఎం.అభిషిక్త్ కిశోర్, జిల్లా కలెక్టర్


