మహారాణిపేట: భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రారంభోత్సవానికి హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. విమానాశ్రయ ప్రాంగణం తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ వైభవాన్ని ప్రతిబింబించాలన్నారు. గిరిజన సంప్రదాయ థింసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించే స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఐఅండ్‌ఐ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.


