సింహగిరిపై పరిమళించే సేవ | - | Sakshi
Sakshi News home page

సింహగిరిపై పరిమళించే సేవ

Jul 27 2026 2:18 AM | Updated on Jul 27 2026 2:18 AM

● అదృష్టం..ఆ భాగ్యం వారిదే... ● అప్పన్న చందనం అరగదీతలో తరిస్తున్న నాల్గోతరగతి సిబ్బంది

సింహాచలం: ప్రతిరోజూ వేలాది మంది భక్తులు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని చందన స్వరూపంలో దర్శించుకుని తరించిపోతుంటారు. కానీ ఆ చందన స్వరూపం వెనుక ఎన్నో చేతుల భక్తి, శ్రమ దాగి ఉంటుంది. స్వామివారిపై అలంకరించే చందనాన్ని సిద్ధం చేసే ఆ అరుదైన సేవ సింహాచలం దేవస్థానంలోని నాల్గో తరగతి ఉద్యోగులదే. వారికి ఇది ఉద్యోగ బాధ్యత కాదు... స్వామి ప్రసాదించిన మహాభాగ్యం. సింహగిరిపై వెలసిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేశంలోనే ప్రత్యేకమైన క్షేత్రం. ఏడాదిలో ఒకరోజు మాత్రమే నిజరూప దర్శనం ఇచ్చే స్వామివారు, మిగిలిన రోజులన్నీ చందన స్వరూపంలోనే భక్తులకు దర్శనమిస్తారు. ఆ చందనాన్ని సిద్ధం చేసే అవకాశం అందరికీ దక్కదు. తరతరాలుగా దేవస్థానంలోని నాల్గో తరగతి ఉద్యోగులే ఈ సేవను భక్తి, నియమనిష్ఠలతో కొనసాగిస్తున్నారు.

ఏడాదికి 500 కిలోల చందనం

ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియనాడు జరిగే చందనోత్సవంలో స్వామివారు నిజరూప దర్శనం ఇస్తారు. అనంతరం అదే రోజు రాత్రి తొలి విడతగా సుమారు 125 కిలోల పచ్చి చందనాన్ని సమర్పిస్తారు. తర్వాత వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో మూడు విడతలుగా చందనం సమర్పిస్తారు. ఏడాదికి మొత్తం దాదాపు 500 కిలోల పచ్చి చందనాన్ని స్వామివారికి అర్పిస్తారు.

ఐదు రోజులపాటు భక్తి శ్రమ

ప్రతి విడత సమర్పణకు ముందు ఐదు రోజులపాటు ఆలయంలోని బేడా మండపంలో చందనం అరగదీత జరుగుతుంది. పర్మినెంట్‌, అవుట్‌సోర్సింగ్‌ నాల్గో తరగతి ఉద్యోగులే ఇందులో పాల్గొంటారు. ఒక్క చుక్క తేమ, ఒక్క తుప్పర కూడా చందనంలో పడకుండా మాస్కులు ధరించి, సంప్రదాయ వస్త్రాల్లో అత్యంత శ్రద్ధతో చందనాన్ని అరగదీస్తారు. అనంతరం వైదికులు సుగంధ ద్రవ్యాలు కలిపి స్వామివారికి సమర్పించేలా సిద్ధం చేస్తారు.

ఆ రోజుల్లో ఆలయం అంతా చందన పరిమళాలతో నిండిపోతుంది. ఆ సువాసన మధ్య సేవ చేయడం తమ జీవితంలో మరచిపోలేని అనుభూతి అని ఉద్యోగులు చెబుతుంటారు.

పారితోషికం కాదు... మహాప్రసాదం

చందనం అరగదీసినందుకు దేవస్థానం ఉద్యోగులకు బియ్యాన్ని అందిస్తుంది. ఒక కిలో చందనం సిద్ధం చేస్తే మూడు కిలోల బియ్యం ఇస్తుంది. కానీ ఉద్యోగులు దానిని కూలిగా చూడరు. ‘ఇది స్వామివారి మహాప్రసాదం’ అని భక్తితో స్వీకరిస్తారు. అదే తమ కుటుంబానికి దైవ ఆశీర్వాదంగా భావిస్తారు.

తగ్గుతున్న శాశ్వత ఉద్యోగులు

కాలక్రమేణా శాశ్వత నాల్గో తరగతి ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. పదవీ విరమణలతో వారి స్థానంలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చేరుతున్నారు. అయినప్పటికీ చందన అరగదీత సంప్రదాయం మాత్రం కొనసాగుతోంది. ఇటీవల స్వచ్ఛంద సేవకులు కూడా ఈ సేవలో భాగస్వాములవుతున్నారు.

అంతా స్వామి అనుగ్రహమే

ఉద్యోగంలో చేరినప్పటి నుంచి 29 ఏళ్లుగా స్వామివారి చందనం అరగదీతలో పాల్గొంటున్నాను. ప్రతి ఏడాది నాలుగు విడతల్లో జరిగే ఈ సేవలో తప్పకుండా భాగస్వామిని అవుతాను. చందనం అరగదీసే రోజుల్లో ఆలయం అంతా పరిమళభరితంగా మారిపోతుంది. ఆ పవిత్ర సేవలో పాల్గొనడం అంతా స్వామివారి అనుగ్రహమే.

–శిడగం అప్పలరాజు, నాల్గో తరగతి ఉద్యోగి

35 ఏళ్లుగా చందన సేవ నా అదృష్టం

ఎన్‌ఎంఆర్‌గా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు 35 ఏళ్లుగా స్వామివారి చందనాన్ని అరగదీసే సేవలో పాల్గొంటున్నాను. ప్రతి ఏడాది ఈ అవకాశం దక్కడం నా పూర్వజన్మ సుకృతం. స్వామివారికి సమర్పించే చందనం మా చేతుల మీదుగా సిద్ధం కావడం నిజంగా ఆయన ప్రసాదించిన మహాభాగ్యం.

– పట్నాల వరహాలరావు, నాల్గో తరగతి ఉద్యోగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement