మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లాలో కరోనా కేసులు మరోసారి నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో ఇప్పటివరకు ఏడుగురికి కరోనా నిర్ధారణ కావడంతో గతంలో కరోనా సృష్టించిన విషాదాన్ని ప్రజలు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. అయితే కేసులు వెలుగుచూస్తున్నప్పటికీ, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు చర్యలు కాగితాలకే పరిమితమయ్యాయని, జిల్లాలో అప్రమత్తత లోపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వ పరీక్షల జాడ లేదు
ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులన్నీ బాధితులు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవడం ద్వారానే వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం తరఫున విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం కేజీహెచ్‌లోని వీఆర్‌డీఎల్ ల్యాబ్‌లో మాత్రమే పరీక్షలు అందుబాటులో ఉండగా, జిల్లాలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. దీంతో అనుమానిత లక్షణాలు ఉన్నవారు ప్రైవేటు ల్యాబ్‌లనే ఆశ్రయిస్తున్నారు.
జ్వరాల సర్వేలు నామమాత్రమే
క్షేత్రస్థాయిలో జ్వరాల సర్వేలు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటింటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తించే ప్రక్రియ ఎక్కడా కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో కరోనా లక్షణాలు ఉన్నవారు అధికారికంగా గుర్తింపునకు రావడం లేదు. ఇటీవల నమోదైన కేసుల్లో మూడు ప్రైవేటు ల్యాబ్‌ల్లోనే బయటపడటం ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
కిట్లు రికార్డుల్లోనేనా?
కరోనా నిర్ధారణకు అవసరమైన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో లేవు. రికార్డుల్లో మాత్రం కిట్లు ఉన్నట్లు చూపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అందుబాటులో లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలు పూర్తిగా ప్రైవేటు ల్యాబ్‌లపైనే ఆధారపడాల్సి వస్తోంది.
స్క్రీనింగ్ లేకుంటే ప్రమాదమే
దేశ, విదేశాల నుంచి వేలాది మంది నిత్యం రాకపోకలు సాగించే విశాఖలో కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు, రైలు, విమాన, సముద్ర మార్గాల ద్వారా వచ్చే ప్రయాణికుల్లో లక్షణాలు ఉన్నవారిని గుర్తించే వ్యవస్థ కనిపించడం లేదని తెలుస్తోంది. వైరస్ వ్యాప్తి చెందకముందే అనుమానితులను గుర్తించి పరీక్షలు నిర్వహించడం, అవసరమైతే ఐసోలేషన్‌లో ఉంచడం అధికార యంత్రాంగం బాధ్యతగా నిపుణులు సూచిస్తున్నారు.
అప్రమత్తత పెంచాల్సిందే..
కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు పెరగకుండా, అదే సమయంలో అప్రమత్తతను పెంచే చర్యలు అత్యవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్క్రీనింగ్ పరీక్షలు విస్తరించడం, పీహెచ్‌సీల్లో టెస్టింగ్ సౌకర్యాలు కల్పించడం, ర్యాపిడ్ కిట్లు అందుబాటులో ఉంచడం, జ్వరాల సర్వేలను ముమ్మరం చేయడం ద్వారా మాత్రమే కరోనా వ్యాప్తిని ప్రారంభ దశలోనే అడ్డుకునే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.


