డాబాగార్డెన్స్: దేవదేవుడు శ్రీ జగన్నాథస్వామి తిరుగు రథయాత్ర ఆదివారం నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర సమేతంగా గుండిచా మందిరంలో పదకొండు రోజుల పాటు భక్తుల పూజలందుకున్న స్వామివారు తిరిగి స్వస్థానమైన టౌన్‌కొత్తరోడ్డులోని జగన్నాథస్వామి ఆలయానికి మహోత్సవంగా చేరుకున్నారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, భజనలు, నామసంకీర్తనల మధ్య వేలాది మంది భక్తులు రథాన్ని లాగుతూ స్వామివారికి ఘన స్వాగతం పలికారు.
నేత్రపర్వంగా తిరుగు రథయాత్ర
టర్నర్ చౌల్ట్రీలోని గుండిచా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మూలవిరాట్టులను వేదపండితులు ఘనంగా రథంపై అధిష్టింపజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి టి. రాజగోపాల్‌రెడ్డి, దేవదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్, ఫెస్టివల్ ఆఫీసర్ టి. అన్నపూర్ణ, వివిధ ఆలయాల కార్యనిర్వహణాధికారులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టర్నర్ చౌల్ట్రీ నుంచి ప్రారంభమైన రథయాత్ర ఆంజనేయస్వామి ఆలయం, పూర్ణా మార్కెట్, ఏవీఎన్ కాలేజీ డౌన్‌రోడ్డు మీదుగా టౌన్‌కొత్తరోడ్డులోని జగన్నాథస్వామి ఆలయానికి చేరుకుంది. మార్గమంతా భక్తులు స్వామివారికి హారతులు ఇస్తూ, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. రథాన్ని లాగేందుకు భక్తులు ఉత్సాహంగా పోటీపడ్డారు. జగన్నాథస్వామి ప్రార్థనా గాన సంఘం సభ్యుల భగవన్నామ సంకీర్తన, విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా, గోవింద నామస్మరణ, సన్నాయి మేళతాళాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉట్టిపడేలా చేశాయి. సోమవారం స్వామివారికి సంప్రోక్షణ, పీఠారోహణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈవో టి. రాజగోపాల్‌రెడ్డి, అర్చకులు ఏడిద సురేష్‌బాబు, జగన్నాథాచార్యులు, రంగనాథాచార్యులు తెలిపారు.
టర్నర్ చౌల్ట్రీ–టౌన్‌కొత్తరోడ్డు మార్గంలో
ట్రాఫిక్ మళ్లింపు
తిరుగు రథయాత్ర సందర్భంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు టర్నర్ చౌల్ట్రీ నుంచి టౌన్‌కొత్తరోడ్డు వరకు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. జగదాంబ జంక్షన్ నుంచి పాత పోస్టాఫీస్ వైపు వెళ్లే వాహనాలను టర్నర్ చౌల్ట్రీ వద్ద నుంచి పోలీస్ బ్యారెక్స్, డాల్ఫిన్ హోటల్ జంక్షన్, 75 ఫీట్ రోడ్డు, రామకృష్ణా జంక్షన్, స్టేడియం రోడ్డు, పోర్టు రోడ్డు మీదుగా మళ్లించారు. ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


