ఏయూలో ఉద్యోగాల పేరుతో కొత్త దందా.. డైలీ వేజ్ కార్మికులను వదలని వైనం ఎంపీ పేషీ అండ ఉందంటూ ప్రచారం టైమ్ స్కేల్ ఉద్యోగులుగా మార్చేస్తామంటూ నమ్మించే ప్రయత్నం ఒక్కొక్కరి నుంచి రూ.20 వేల వరకు వసూళ్లు? ముగ్గురు కనుసన్నల్లో అవినీతికి స్కెచ్
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డైలీవేజ్ కార్మికులను టైమ్‌స్కేల్ ఉద్యోగులుగా మారుస్తామంటూ కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు క్యాంపస్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కార్మికుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక్కో వ్యక్తి నుంచి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం వెనుక ముగ్గురు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎంపీ కార్యాలయం పేరుతో..
టైమ్‌స్కేల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులు, తాము ఎంపీ భరత్ కార్యాలయం ద్వారా పనులు చేయించగలమని కార్మికులను నమ్మిస్తున్నట్లు సమాచారం. డైలీవేజ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం లేదా విశ్వవిద్యాలయ యాజమాన్యం మాత్రమే నిర్ణయం తీసుకునే అధికారం కలిగి ఉండగా, కొందరు ప్రజాప్రతినిధి కార్యాలయాల పేర్లను ఉపయోగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ ఎంపీ కార్యాలయంలోని కొందరు వ్యక్తులు తెరవెనుక పాత్ర పోషిస్తున్నారా? లేక ప్రజాప్రతినిధి పేరును దుర్వినియోగం చేస్తున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఎంపీ కార్యాలయం కూడా అంతర్గతంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
‘పోస్టు ఇప్పిస్తాం’ అంటూ డబ్బుల వసూళ్లు?
పోస్టును టైమ్‌స్కేల్‌లోకి మారుస్తామని హామీ ఇస్తూ ఒక్కో వ్యక్తి నుంచి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకుంటున్నట్లు కార్మికుల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే పలువురు డబ్బులు చెల్లించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు. అయినప్పటికీ క్యాంపస్‌లో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది.
విచారణ జరపాలంటున్న ఉద్యోగ సంఘాలు
డైలీవేజ్ కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఎవరైనా మోసాలకు పాల్పడుతున్నట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కష్టపడి సంపాదించిన డబ్బును ఆశ చూపించి దోచుకోవడం అమానుషమని వారు అంటున్నారు. ఈ ఆరోపణలపై విశ్వవిద్యాలయ యాజమాన్యం రహస్య విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని కోరుతున్నారు.
గత ఘటనల నేపథ్యంలో
అప్రమత్తత అవసరం
ఇంతకుముందు కూడా ఉద్యోగాల పేరుతో వసూళ్లకు సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఏయూ యాజమాన్యం అప్రమత్తమైన విషయం గుర్తు చేస్తున్నారు. మళ్లీ అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం నేపథ్యంలో ఈసారి కఠిన చర్యలు తీసుకోవాలని మేధావులు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రజాప్రతినిధుల పేర్లను దుర్వినియోగం చేస్తున్న వారిపై కూడా దర్యాప్తు జరిపి నిజానిజాలు బయటపెట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
పదేళ్లుగా ఎదురు చూపులే...
ఏయూలో సుమారు 252 మంది డైలీవేజ్ కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. హాస్టళ్ల మెస్‌లు, గెస్ట్‌హౌస్‌లు, రికార్డు విభాగాలు తదితర చోట్ల స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కేటగిరీల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజుకు సుమారు రూ.300 చొప్పున, నెలకు దాదాపు రూ.9 వేల వేతనం అందుకుంటున్నారు. పదేళ్లకు పైగా వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కోసం ఎదురుచూస్తున్న వీరికి టైమ్‌స్కేల్ ఉద్యోగాలపై సహజంగానే ఆశలు ఉన్నాయి. అదే బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు దందాకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.


