మహారాణిపేట: రాష్ట్రపతి ఉత్తర్వులు–2025కు అనుగుణంగా ఉద్యోగుల కేడర్ కేటాయింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిబంధనల మేరకు నిర్ణీత సమయపట్టిక ప్రకారం పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగు హాలులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాత జిల్లా కేడర్ నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపును దశలవారీగా చేపట్టాలన్నారు. ప్రతి శాఖకు సంబంధించిన కేడర్ బలం, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను సమగ్రంగా పరిశీలించి వివరాలను ఖరారు చేయాలని, అర్హులైన ఏ ఒక్క ఉద్యోగీ సీనియారిటీ జాబితా నుంచి మినహాయింపు కాకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని పేర్కొంటూ, జూలై 16న ముసాయిదా సీనియారిటీ జాబితా ప్రచురణ, జూలై 20 నాటికి అభ్యంతరాల స్వీకరణ, జూలై 22న తుది సీనియారిటీ జాబితా ప్రచురణతో పాటు ఆప్షన్ల స్వీకరణ చేపట్టాలని కలెక్టర్ వివరించారు. జూలై 26లోగా ఆప్షన్ల దాఖలు పూర్తి చేసి, జూలై 28న తుది కేటాయింపు జాబితా, ఉత్తర్వులను జారీ చేయాలన్నారు. అనంతరం జూలై 30న కొత్త నియామక యూనిట్లలో రోస్టర్ల ప్రారంభం, చేరిక ఉత్తర్వుల జారీ ప్రక్రియను ముగించి, ఆగస్టు 5లోగా కొత్త యూనిట్లలో ఉద్యోగుల చేరిక పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అభ్యంతరాలు, ఆప్షన్ ఫారాలను నిబంధనల ప్రకారం నిష్పక్షపాతంగా పరిశీలించాలని, శాఖల మధ్య సమన్వయంతో ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, కలెక్టరేట్ ఏవో బీవీ రాణి, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.


