ఓపిక నశించింది.. ఉద్యమం ఉధృతం | - | Sakshi
Sakshi News home page

ఓపిక నశించింది.. ఉద్యమం ఉధృతం

Jul 16 2026 7:18 AM | Updated on Jul 16 2026 7:18 AM

● విద్యుత్‌ కార్మికుల సమస్యలపై కదంతొక్కిన స్ట్రగుల్‌ కమిటీ ● ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం వద్ద భారీ ధర్నా

సాక్షి, విశాఖపట్నం: సమస్యలు పరిష్కరించాలంటూ పదే పదే ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదు.. ఇక మా ఓపిక నశించిపోయింది.. ఆగస్ట్‌ 10న నిర్వహించే మహా ధర్నాతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ), ఏపీ విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్‌ స్ట్రగుల్‌ కమిటీ ప్రతినిధులు హెచ్చరించారు. విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం ఎదుట యూనియన్ల ఆధ్వర్యంలో బుధవారం భారీ ధర్నా నిర్వహించారు. విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికులపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం డైరెక్టర్‌(ప్రాజెక్ట్స్‌) వనజకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, ఏపీఈపీడీసీఎల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు ఆర్‌కేఎస్‌వీ రవికుమార్‌, స్ట్రగుల్‌ కమిటీ అధ్యక్షుడు వేపాడ సత్యనారాయణ మాట్లాడుతూ.. వెంటనే పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. పెండింగ్‌ డీఏలు, ఎరియర్స్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.48 వేలు అమలు, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ, ఓ అండ్‌ ఎం సిబ్బందికి 30 శాతం రిస్క్‌ అలవెన్స్‌, అపరిమిత జీవిత బీమా, గ్రేడ్‌–2 జేఎల్‌ఎంల పదోన్నతులు, ప్రైవేటీకరణ నిలిపివేత వంటి 20 ప్రధాన డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామన్నారు. రెండు వారాల్లోగా ఈ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చొరవ చూపకపోతే ఆగస్టు 10న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి మహా ధర్నాకు విద్యుత్‌ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ కంపెనీ అధ్యక్షుడు శ్రీనివాస్‌, అనకాపల్లి జిల్లా నాయకులు ప్రేమ చంద్రశేఖర్‌, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు రవి, యూనియన్‌ నాయకులు రాజశేఖర్‌, గోపి, అవతారం, షరీఫ్‌, అప్పారావు, నానాజీతో పాటు పెద్ద సంఖ్యలో విద్యుత్‌ కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement