ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం | - | Sakshi
Sakshi News home page

ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం

Jul 16 2026 7:18 AM | Updated on Jul 16 2026 7:18 AM

పరవాడ: జేఎన్‌ ఫార్మాసిటీలోని శ్రీ సాయి చందన పరిశ్రమలో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్తి నష్టం సంభవించినప్పటికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రొడక్షన్‌ బ్లాక్‌–2లోని తొలి అంతస్తులో ఉన్న రియాక్టర్‌ వద్ద అకస్మాత్తుగా పొగలు రావడంతో షిఫ్ట్‌ ఇన్‌చార్జి, సిబ్బంది అప్రమత్తమై అక్కడ పనిచేస్తున్న 11 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తరలించారు. రియాక్టర్‌లోని మిథనాల్‌ రియాక్షన్‌ కారణంగా మంటలు భారీగా ఎగసిపడి, ప్రొడక్షన్‌ బ్లాక్‌లోని రియాక్టర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే యలమంచిలి, అనకాపల్లి, సబ్బవరం, పెదగంట్యాడతో పాటు రాంకీ సంస్థ నుంచి మొత్తం 10 అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. పరవాడ సీఐ ఎల్‌.భాస్కరరావు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని ఫార్మాసిటీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ, సీఐటీయూ నాయకుడు రుత్తల శంకరరావు డిమాండ్‌ చేశారు. ఘటనాస్థలిని పరవాడ తహసీల్దార్‌ పి.వి.రత్నం, జాయింట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ శివశంకర్‌ రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఈఈ ముకుందరావు సందర్శించి, ప్రమాదానికి గల కారణాలపై యాజమాన్యాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement