వెరీ పిటీ!
విశాఖ పోర్టు ఐటీ విభాగంలో గ్రూపుల గోల అప్రెంటిస్‌లను సొంత పనులకు వాడుకుంటున్న అధికారులు ఉన్నతాధికారులపైనా పెత్తనం చెలాయించేలా వ్యవహారశైలి చైర్మన్ లేకపోవడంతో గాడి తప్పిన పోర్టు పాలన డిప్యూటీ డైరెక్టర్‌ను బదిలీ చేసిన డిప్యూటీ చైర్‌పర్సన్
పోర్టు ఐటీ..
సాక్షి, విశాఖపట్నం: కొద్ది నెలల కిందట వరకు మేజర్ పోర్టులతో పోటీ పడుతూ ప్రగతి పథంలో సాగిన విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ).. ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇన్‌చార్జి చైర్మన్ పాలన, కీలకమైన ఉన్నతాధికారుల నియామకంలో జాప్యం కారణంగా పోర్టు పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది. ఇదే సమయంలో పోర్టు ఐటీ విభాగంలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయి, పరస్పర ఫిర్యాదుల పర్వం మొదలైంది. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ చైర్‌పర్సన్ ఐటీ విభాగం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.
గాడి తప్పిన పరిపాలన
విశాఖ పోర్టులో పరిపాలన గాడి తప్పింది. పాలన సాగించాల్సిన కీలక అధికారులు బదిలీ కావడంతో కార్యకలాపాలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రస్తుతం పోర్టు ఇన్‌చార్జి చైర్మన్‌గా ఉన్న డా. అంగముత్తు.. తన సమయాన్ని సింహభాగం ముంబయి పోర్టు చైర్మన్ బాధ్యతలకే కేటాయిస్తున్నారు. దీంతో ఇక్కడ పర్యవేక్షణ లోపించింది. ఇటీవలే డిప్యూటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన రోష్ని అపరాంజి, విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ పోర్టు వ్యవహారాలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐటీ విభాగంలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు బట్టబయలయ్యాయి. ఐటీ వింగ్‌లో పలువురు అధికారుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని, కొందరు అధికారుల హోదాను అడ్డం పెట్టుకుని కింది స్థాయి సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
సొంత పనులకు అప్రెంటిస్‌లు
పోర్టులో అప్రెంటిస్‌గా చేరిన వారిని ఐటీ విభాగంలోని కొందరు అధికారులు తమ సొంత పనులకు వాడుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరు అధికారుల మధ్య విభేదాలు ముదరడంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని సమాచారం. ఓ ఐటీ అధికారి అయితే ఏకంగా ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేయడమే కాకుండా, వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల డిప్యూటీ చైర్‌పర్సన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ అధికారులు కాన్ఫరెన్స్ హాల్‌లోనే ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ పోర్టు పరువు తీశారన్న విమర్శలున్నాయి. ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ చైర్‌పర్సన్.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఐటీ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న ఓ అధికారిని తక్షణం ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేసినట్లు తెలిసింది. అయితే, సదరు అధికారి తప్పేమీ లేదని, ఐటీ విభాగం అంతా గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటున్నారని మరికొందరు వాదిస్తున్నారు. కేవలం సొంత ప్రయోజనాలపైనే దృష్టి సారించి, పోర్టు వ్యవహారాలను పక్కన పెట్టేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల కొరత కారణంగా ఫైళ్లు ముందుకు కదలక, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. వీలైనంత త్వరగా విభాగాధిపతులను నియమించి, పోర్టును తిరిగి గాడిలో పెట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు.


