నడకకు వెళ్లి.. అనంతలోకాలకు..
జీవీఎంసీ వాహనం ఢీకొని
వృద్ధుడి మృతి
ఆరిలోవ: ఓ వృద్ధుడు ఉదయం వాకింగ్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా జీవీఎంసీ చెత్త తరలించే వాహనం ఢీకొని మృతి చెందారు. ఈ విషాద ఘటన శుక్రవారం ఆరిలోవలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కృష్ణ తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 10వ వార్డు శ్రీకాంత్‌నగర్‌లో నివాసముంటున్న మజ్జి రామారావు (66) రోజూ బీఆర్‌టీఎస్ రోడ్డులో ముడసర్లోవ వైపు వాకింగ్‌కు వెళ్తుంటారు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం వాకింగ్ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా.. స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం ఎదురుగా జీవీఎంసీ చెత్త వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడిన రామారావు తలకు తీవ్ర గాయమై, అధిక రక్తస్రావం జరగడంతో మృతి చెందారు. వాహన డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి భార్య రమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రామారావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంటి పెద్ద మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


