పేదల జోలికొస్తే పోరాటం తప్పదు
బీచ్‌రోడ్డు: నగరంలోని మురికివాడల్లో నివాసం ఉంటున్న పేదలు కదం తొక్కారు. ఎక్కడి మురికివాడలను అక్కడే అభివృద్ధి చేయాలని నినదించారు. నివాస హక్కుల పోరాట దినం సందర్భంగా మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం చలో జీవీఎంసీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ కళాకారులు తమ ఆటపాటలతో ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. మురికివాడల ప్రజలపై వివక్ష తగదని, పాలకుల, అధికారుల నిర్లక్ష్యం నశించాలంటూ నినదించారు. అనంతరం జరిగిన మహా ధర్నాలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.లక్ష్మి మాట్లాడుతూ.. మురికివాడ అభివృద్ధి చట్టం–1956 ప్రకారం స్లమ్స్‌ను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడి వారికి అక్కడే ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. 2012లో పేదలు నివాసాల కోసం పెద్ద ఎత్తున పోరాడి హక్కులు సాధించుకున్నారని, ఆ పోరాటా న్ని అణచివేయడం పాలకుల తరం కాలేదని గుర్తుచేశారు. సమస్యలను పరిష్కరించకపోతే మరోసారి నాటి ఘటనలు పునరావృతమవుతాయని హెచ్చరించారు. మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు ఎం.శరత్ మాట్లాడుతూ.. పేదలు నివాసం ఉంటున్న భూములను లాగేసుకునే కుట్రలో భాగంగానే తరలింపు, తొలగింపు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు రమణమూర్తి, న్యాయవాది గిరిధర్, భీమ్ సేన ప్రధాన కార్యదర్శి డాక్టర్ వసంత రాజేంద్రప్రసాద్, పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు టి.శ్రీరామ్మూర్తి, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, దళిత విముక్తి రాష్ట్ర కన్వీనర్ సుర్ల వెంకటరమణ, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, వై.కొండయ్య, న్యాయవాదులు పల్లెటి అప్పారావు, కె.పద్మ, పలు సంఘాల నాయకులు అనురాధ, వై.నూకరాజు, జీడి సారయ్య, ఏపీబీఎస్పీ లక్ష్మి, యు.వెంకటేశ్వర్లు, నిర్మల, బాలనాగమ్మ, ఈసర లక్ష్మి, గోపాలం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పేదల జోలికొస్తే పోరాటం తప్పదు


