ఆటో ఢీకొని వ్యక్తి మృతి
పీఎం పాలెం: రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొనడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఇందుకు సంబంధించి పీఎం పాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కొరపుకృష్ణాపురం గ్రామానికి చెందిన ముగడ సింహాచలం(65) మధురవాడ ధర్మపురికాలనీలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య అప్పలనారాయణ నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లింది. అతడు గురువారం రాత్రి 9 గంటల సమయంలో భోజనం చేయడానికి హోటల్‌కు కాలినడకన బయలుదేరాడు. కారుషెడ్ కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొనగా తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. మృతుని భార్య అప్పలనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.


