తప్పుడు కేసులు పిరికిపంద చర్య
బీచ్‌రోడ్డు: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నిస్తే, వారి గొంతు నొక్కేలా తప్పుడు కేసులు పెట్టి బెదిరించడం పిరికిపంద చర్య అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు విమర్శించారు. విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ, శుక్రవారం వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ముందుగా గాంధీ విగ్రహానికి కె.కె.రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, విద్యార్థి సంఘాలపైన, వైఎస్సార్ సీపీ నాయకులపైన దాడులు, హత్యలు చేస్తూ ఆరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. హామీలను నెరవేర్చేందుకు కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చామని, అయినా హామీలు నెరవేర్చకపోగా.. ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం సిగ్గు చేటన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అప్పటి వరకు నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పి, నేటికీ అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, మరొక 6 హామీలను అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, తల్లికి వందనం, హాస్టల్స్ వసతుల కోసం ఎవరైతే ప్రశ్నిస్తున్నారో.. వారిపై గంజాయి కేసులు, రౌడీ షీట్లు నమోదు చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా, అన్ని వర్గాలపై దాడులు చేస్తూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. తక్షణమే అక్రమ కేసులు నిలిపివేసి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేకపోతే ప్రజలు మరింతగా నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
నిరసనలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉరుకూటి రామచంద్రరావు, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యనిర్వహణ అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీవత్సవ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పల్లా దుర్గ, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు బొల్ల్లవరపు జాన్ వెస్లీ, పేర్ల విజయ్ చందర్, రాష్ట్ర అనుబంధ విభాగాల కార్యనిర్వాహక అధ్యక్షుడు చెన్న జానకి రామ్, జిల్లా ఉపాధ్యక్షుడు రెయ్యి డేవిడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మువ్వల సురేష్, జోనల్, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు ముట్టి సునీల్ కుమార్, తమ్ములూరు జగదీష్ రెడ్డి, బోని శివ రామకృష్ణ, రామా రెడ్డి, శ్రీదేవి వర్మ, దేవరకొండ మార్కండేయులు, నీలి రవి, జిలకర్ర నాగేంద్ర, పార్టీ నాయకులు దొడ్డి కిరణ్, మహ్మద్ ఇమ్రాన్, రామన్న పాత్రుడు, ఎం.డి షరీఫ్, బిపిన్ కుమార్ జైన్, తాడి రవి తేజ్, రవికిరణ్ రెడ్డి, మువ్వల సంతోష్, కోన శంకర్, చోలింగి నాగేశ్వరరావు, బోడేటి ప్రసాద్, బంగారు భవానీశంకర్, లోకనాథం, భాస్కరరావు, దమయంతి, నిఖిల్, ఇప్పిలి పార్వతి, తిరుమల రావు, పీతల గోవింద, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.
తప్పుడు కేసులు పిరికిపంద చర్య


