24 నుంచి విశాఖ ఉత్సవ్
మహారాణిపేట: విశాఖ వైభవాన్ని చాటిచెప్పేలా ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ‘విశాఖ ఉత్సవ్’ను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. శుక్రవారం కలెక్టర్‌ట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన ఏర్పాట్లపై సమీక్షించారు. ఇదే సమావేశంలో వర్చువల్‌గా భాగస్వామ్యమైన హోంమంత్రి అనిత పలు అంశాలపై సూచనలు చేశారు. వేడుకలను వైభవంగా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఇన్‌చార్జి మంత్రి మాట్లాడుతూ ఈనెల 24, 25వ తేదీల్లో అనకాపల్లి జిల్లాలో, 26 నుంచి 31వ తేదీ వరకు విశాఖ, అల్లూరి జిల్లాలో ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఫిబ్రవరి 1న ఆదివారం కావడంతో ప్రత్యేకంగా అరకులో ఉత్సవాలను కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు సమన్వయంగా ఏర్పాట్లు చేయాలన్నారు. విశాఖలో భీమిలి, రుషికొండ, సాగర్‌నగర్, ఆర్కే బీచ్ తదితర ఎనిమిది ప్రాంతాల్లో ఉత్సవాలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో జనవరి చివరి నాటికి పాత వ్యర్థాలు పూర్తిగా తొలగించాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించామన్నారు. అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించుకోవాలన్నారు. మహిళల భద్రత కోసం నగరాన్ని చీకటి ప్రాంతాలు లేని ‘ఇల్యుమినేషన్ సిటీ’గా మార్చాలని సూచించినట్లు తెలిపారు. విశాఖ పోర్టు నుంచి బొగ్గు, ఇతర ముడి పదార్థాల రవాణా సమయంలో కాలుష్యం వ్యాపించకుండా.. టార్పాలిన్లతో కప్పి ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


