విశాఖపై కాలుష్యం పడగ
డీఆర్సీ సమావేశంలో
ప్రజాప్రతినిధుల ఆందోళన
మహారాణిపేట: అందమైన విశాఖ నగరాన్ని కాలుష్యం కమ్మేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంతో నగర ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, దీని నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు కోరారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన జిల్లా సమీక్ష మండలి(డీఆర్సీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కాలుష్య నియంత్రణ, మౌలిక వసతుల కల్పనపై విస్తృతంగా చర్చించారు.
గాలి నాణ్యతపై ఆందోళన
సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దక్షిణ నియోజకవర్గంలో కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని, తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.
రూ.4 కోట్లకు పైగా జరిమానా: కలెక్టర్
దీనిపై స్పందించిన కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణకు ఇప్పటికే పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. పరిశ్రమలు, లేబర్, రెవెన్యూ శాఖలతో ప్రత్యేక కమిటీ వేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన సంస్థలకు ఇప్పటికే రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు జరిమానా విధించామన్నారు. నగరంలో 10 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కేంద్రాలు ఉన్నాయని, అయితే ద్వారకానగర్ కేంద్రం మాత్రమే జాతీయ స్థాయికి అనుసంధానమై ఉండటంతో.. అక్కడి డేటా ఆధారంగా పొల్యూషన్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని వివరించారు. పెట్రోల్ బంకుల్లో నాణ్యత పరీక్షలు, బొగ్గు రవాణా వాహనాలపై నిఘా ఉంచామని తెలిపారు. కాలం చెల్లిన వాహనాలను తనిఖీ చేసేలా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టామని వివరించారు.
మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి కావాలి
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభమయ్యే నాటికి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న విశాఖలో మౌలిక వసతులు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని సూచించారు. ఇదే అంశంపై ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ.. రోడ్ల పనులు పూర్తి కాకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
అధికారులకు మంత్రి ఆదేశాలు
● నగరంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. మద్యం సేవించే విధులకు హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
● ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలి. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించి, మాతా శిశు మరణాలను తగ్గించాలి.
● 22–ఎ భూములు, రీ–సర్వే, గ్రామాల్లో పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలి.
● పోలవరం నీరు అందుబాటులోకి వచ్చే నాటికి నిల్వ సామర్థ్యాలు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి.
● దబ్బందలో పెండింగ్‌లో ఉన్న 120 మీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి.
● కొండవాలు ప్రాంతాల్లో సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలి.
● గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలి. రాత్రి వేళల్లో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి.
శానిటేషన్ వర్కర్లగా హిజ్రాలు
జీవీఎంసీ పరిధిలో ఇప్పటికే పారిశుధ్య పనులు చేస్తున్న ఐదుగురు హిజ్రాలకు శానిటేషన్ వర్కర్లుగా మంత్రి అధికారిక అనుమతులు జారీ చేశారు. తమకు అధికారిక గుర్తింపు లభించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.
సమావేశంలో ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, గాదె శ్రీనివాసులు నాయుడు, మేయర్ పీలా శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, డీసీపీ మేరీ ప్రశాంతి, ఆర్డీవోలు సుధాసాగర్, సంగీత్ మాథూర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులు
నగరంలోని పలు పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వ విప్ గణబాబు కోరారు. గోపాలపట్నం తహసీల్దార్ కార్యాలయానికి భవనం లేదా స్థలం కేటాయించాలన్నారు.
కోర్టు కేసుల విషయంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కోరారు.
ఉత్తర నియోజకవర్గంలోని పాఠశాలలకు ప్రహరీలు, లైట్లు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు.
దక్షిణ నియోజకవర్గంలో కొత్త రైతు బజారు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కోరారు. జ్ఞానాపురం మార్కెట్‌కు అదనపు స్థలం కేటాయించాలన్నారు.
పెందుర్తి నియోజకవర్గంలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు కోరారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల విషయంలో భూములు కోల్పోయిన రైతులతో అధికారులు మాట్లాడాలని సూచించారు.


